Karthik : అప్పుడు ఏమనుకున్నానో.. ఇప్పుడు న్యాయం చేసేందుకు ప్రయత్నించా: దినేశ్ కార్తిక్‌

గత సీజన్‌లో సరిగ్గా రాణించలేదని, ఈసారై ఎలాగైనా నిరూపించుకోవాలని

Updated : 06 Apr 2022 12:29 IST

ఇంటర్నెట్ డెస్క్: గత సీజన్‌లో సరిగ్గా రాణించలేదని, ఈసారై ఎలాగైనా నిరూపించుకోవాలని తీవ్రంగా కృషిచేసినట్లు బెంగళూరు బ్యాటర్‌ దినేశ్ కార్తిక్‌ తెలిపాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన దినేశ్ కార్తిక్‌ (23 బంతుల్లో 44 నాటౌట్)ను ‘ప్లేయర్‌ ఆప్‌ ది మ్యాచ్‌’ వరించింది. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘గత సీజన్‌లో నేను ఏవిధంగా రాణించాలని భావించానో.. ఇప్పుడు దానికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాను. ఈ సారి తీసుకున్న శిక్షణ చాలా మెరుగ్గా ఉంది. నాకు శిక్షణ ఇప్పించిన సిబ్బందికి హ్యాట్సాఫ్‌. అయితే నేను చేయాల్సింది ఇంకా పూర్తి కాలేదని మాత్రం ఎప్పటికీ అనుకుంటూనే ఉంటా’’ తెలిపాడు.

రాజస్థాన్‌ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు డుప్లెసిస్‌ (29), అనుజ్‌ రావత్ (26) శుభారంభమే అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లతోపాటు విరాట్ కోహ్లీ (5), డేవిడ్ విల్లే (0), రూథర్‌ఫోర్డ్ (5) పెవిలియన్‌కు చేరడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. అయితే షహ్‌బాజ్ (45)తో కలిసి కార్తిక్‌ 39 బంతుల్లో 67 పరుగులను జోడించాడు. షహ్‌బాజ్‌ ఔటైనా.. హర్షల్‌ పటేల్‌ (9)తో కార్తిక్‌ బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు. ‘‘నేను క్రీజ్‌లో వచ్చేటప్పటికి ఓవర్‌కు 12 పరుగుల లెక్కన చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా రాణించాలనే దానిపై శిక్షణ తీసుకున్నా. తెల్లబంతి క్రికెట్‌ను సాధ్యమైనంత ఎక్కువగా ఆడేందుకు ప్రయత్నించా. లక్ష్యం చేరుకునేందుకు ఈ జర్నీలో నాతో చాలా మంది ప్రయాణిస్తున్నారు. టీ20 క్రికెట్‌ చాలా వరకు ముందస్తు ప్రణాళికలతో ఉంటుందని భావించా కానీ.. ఎక్కడ టార్గెట్‌ చేయాలో కూడా స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. అందుకే నిశ్శబ్దంగా నా పని నేను చేసేశా’’ అని దినేశ్ కార్తిక్ వివరించాడు. దినేశ్‌ కార్తిక్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లో చూడాలని ఉందని, అతడికి జట్టులో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని బెంగళూరు సారథి డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని