ICC Rankings: 1739 రోజుల రికార్డు బద్దలు.. అగ్రస్థానంలోకి అఫ్గాన్‌ ‘ఆల్‌రౌండర్’

అఫ్గానిస్థాన్‌ సీనియర్ ఆటగాడు మహమ్మద్ నబీ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కించుకున్నాడు.

Published : 14 Feb 2024 18:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో అఫ్గానిస్థాన్‌ స్టార్‌ ఆటగాడు మహమ్మద్ నబీ రికార్డు సృష్టించాడు. దాదాపు 1,739 రోజులపాటు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న షకిబ్ అల్‌ హసన్‌ను అధిగమించి నబీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. వన్డే ఫార్మాట్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో నబీ నంబర్‌వన్‌కు వచ్చాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో నబీ సెంచరీ సాధించాడు. పెద్ద వయసులో అగ్రస్థానం దక్కించుకున్న ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నబీ 39 ఏళ్ల 43 రోజుల వయసులో టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు 2015లో తిలకరత్నె దిల్షాన్‌ (38 ఏళ్ల 8 నెలలు) పేరిట ఈ రికార్డు ఉండేది. గతంలో అఫ్గాన్‌ ప్లేయర్లు రషీద్ ఖాన్, ముజీబ్‌ రహ్మన్‌ కూడా ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం సాధించినవారే. 

బౌలర్ల జాబితాలో కేశ్ మహరాజ్‌ (716) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌ తరపున మహమ్మద్ సిరాజ్ (678), జస్‌ప్రీత్ బుమ్రా (665) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. వన్డే బ్యాటర్ల విభాగంలో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ (824) టాప్‌ర్యాంకులో ఉన్నాడు. శుభ్‌మన్‌ గిల్ (801), విరాట్ కోహ్లీ (768), రోహిత్ శర్మ (746) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకుల్లో భారత్‌ నుంచి విరాట్ కోహ్లీ (760) మాత్రమే టాప్‌-10లో ఉన్నాడు. ప్రస్తుతం ఏడో ర్యాంకులో నిలిచాడు. బౌలింగ్‌ జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా (881) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్పిన్‌ ద్వయం రవీంద్ర జడేజా (416), రవి చంద్రన్ అశ్విన్ (326) తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని