Neeraj Chopra: 90+ మీటర్ల క్లబ్‌లో ఉండాలని ఆశిస్తున్నా: నీరజ్‌ చోప్రా

2021 టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరంలో జావెలిన్‌ త్రో చేసి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రా...

Published : 15 Jun 2022 02:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2021 టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరంలో జావెలిన్‌ త్రో చేసి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన నీరజ్‌ చోప్రా.. ఈసారి తన రికార్డును మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు. తనకు ఇప్పుడు 90+ మీటర్ల క్లబ్‌లో చేరాలని ఉందన్నాడు. ఒలింపిక్స్‌ తర్వాత పది నెలలు విశ్రాంతి తీసుకున్న అతడు నేటి నుంచి ఫిన్‌లాండ్‌లో జరిగే పావో నుర్మీ గేమ్స్‌లో పోటీపడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్‌ ఆసక్తికర విషయాలు చెప్పాడు.

భారత్‌లోని పలువురు అథ్లెట్లు 80 మీటర్లకుపైగా జావెలిన్‌ త్రో చేస్తున్నారని తెలిసి మీరెలా ఫీలవుతున్నారని అడిగిన ప్రశ్నకు నీరజ్‌ ఇలా బదులిచ్చాడు. ‘చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో చాలా మంది అథ్లెట్లు 80+ మీటర్లు జావెలిన్‌ విసురుతున్నారు. రోహిత్, యశ్విర్‌, మను, సాహిల్‌తో పాటు పలువురు జూనియర్లు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ అండర్సన్‌ పీటర్స్‌, జాకుబ్‌ వాద్లెచ్‌ వంటి అథ్లెట్లు ఈ ఏడాది 90+ మీటర్లు విసిరారు. దీంతో జావెలిన్‌ త్రో ఆటలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి’ అని పేర్కొన్నాడు. ఇక రాబోయే టోర్నమెంట్లలో ఎలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. ‘ఈ ఏడాది మరింత నిలకడగా రాణించాలనుకుంటున్నా. నా ఫిట్‌నెస్‌ కొనసాగిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని అనుకుంటున్నా. ఇప్పుడు నేను 90 మీటర్ల దూరానికి చేరువలో ఉన్నా. ఇప్పుడు 90+ మీటర్ల రికార్డు చేరితే చాలా సంతోషంగా ఉంటా. నేను ఆ అరుదైన క్లబ్‌లో ఉండాలనుకుంటున్నా’ అని నీరజ్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని