Updated : 10 Aug 2021 14:47 IST

Neeraj Chopra: నా బయోపిక్‌లో హీరోగా ఎవరు నటించాలంటే..

అక్షయ్‌ కుమార్‌, రణ్‌దీప్‌ హుడా.. ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య..! బుల్లెట్‌ దిగిందా లేదా అంటూ పోకిరి సినిమాలో మహేష్‌ బాబు డైలాగ్‌ స్టైల్‌లో.. టోక్యో ఒలింపిక్స్‌లో ఆఖరి ఘట్టంలో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు 23ఏళ్ల హరియాణా అథ్లెట్‌ నీరజ్‌చోప్రా. పసిడి పతకం సాధించక ముందు వరకు.. ఒక లెక్క.. స్వర్ణం సాధించాక ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ అభిమానులను పెంచేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష వరకూ ఉండే ఫాలోవర్ల సంఖ్య... అమాంతం 30లక్షలకు పెరిగిందంటే క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం క్రీడాకారుడిగానే కాదు అతడి లుక్స్‌కి, స్టైల్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఓ పక్క ప్రశంసలు, మరో పక్క నగదు బహుమతులు వెల్లువెత్తుతుంటే... తాజాగా నీరజ్‌ బయోపిక్‌ చర్చనీయాంశమైంది. ఇక ఆ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తే బాగుంటుందన్న ప్రశ్నలు లెవనెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న గతంలో నీరజ్‌నే అడిగితే ఏమని సమాధానమిచ్చాడంటే..

ఈ ఇద్దరూ అంటే ఇష్టం
ఆసియా క్రీడల అనంతరం 2018లో ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ బయోపిక్‌లో ఎవరు బాగుంటారనే ప్రశ్నకు సమాధానంగా..‘‘ నా బయోపిక్‌ తీయడం చాలా సంతోషం.. మా రాష్ట్రం హరియాణాకి చెందిన హీరో రణ్‌దీప్‌ హుడా , నటుడు అక్షయ్‌ కుమార్‌.. ఈ ఇద్దరూ నా అభిమాన నటులు. వీరిద్దరిలో ఎవరు నా బయోపిక్‌లో నటించినా ఓకే’’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. నీరజ్‌ స్వర్ణం సాధించిన అనంతరం.. రణ్‌దీప్‌ హుడా, అక్షయ్‌కుమార్‌ ..ఇద్దరూ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేయగా.. అక్షయ్‌, రణ్‌దీప్ ట్వీట్లు కాస్త వైరల్ గా మారాయి. 

నీకు కొత్త సినిమా దొరికేసింది అక్షయ్‌!

ఎప్పుడు వైవిధ్యమైన, ప్రయోగాత్మక, నిజజీవిత సమస్యలు, బయోపిక్‌లను.. అభిమానులకు తెరమీద చూపించే అక్షయ్‌కు ఇప్పుడు ఫ్యాన్స్‌ సరదా పంచ్‌ విసురుతున్నారు. అక్షయ్‌ కొత్తసినిమా దొరికేసింది అని ఒకరంటే.. గతంలో జావెలిన్‌ త్రో దిగిన పాత చిత్రాన్ని పోస్ట్‌ చేసి నీరజ్ చోప్రా బయోపిక్‌ సెట్స్‌ నుంచి లీక్‌ అయిన చిత్రాలు ఇవిగో అంటున్న మీమ్స్‌ నెట్టింట సందడి చేస్తున్నాయి.

అదే నీరజ్‌కు రజనీకి ఉన్న సంబంధం: నటుడు రణ్‌దీప్‌ హుడా

నీరజ్‌ మరో అభిమాన నటుడు రణ్‌వీర్‌ హుడా.. కేవలం నటుడిగానే కాదు.. క్రీడాకారుడని మీకు తెలుసా. హరియాణాలోని మోతీలాల్ నెహ్రూ స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌లో స్విమ్మింగ్‌, ఇక్విస్ర్టియన్‌ స్పోర్ట్స్‌లోనూ శిక్షణ పొంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. శనివారం నీరజ్‌ స్వర్ణం సాధించడంపై సంతోషం వ్యక్తం చేసిన రణ్‌దీప్‌.. ‘‘నిజంగా.. జావెలిన్‌ని పాతావ్‌’’ అంటూ ట్వీట్‌ చేయగా తాజాగా నీరజ్‌ నీరజ్ అని జపం చేస్తే.. రజనీ రజనీ అని వినిపిస్తుందనీ.. రజనీకాంత్‌ ప్రతీచోటా ఉన్నాడని.. నీరజ్‌- రజనీ ఇద్దరినీ అనుసంధానం చేస్తూ ట్వీట్‌ చేయడం వైరల్‌గా మారింది. మరి ఒలింపిక్స్‌లో అథెట్ల విభాగంలో వందేళ్ల రికార్డును బద్దలుకొట్టిన నీరజ్ బయోపిక్‌లో ఎవరు హీరోగా నటిస్తారో చూడాలంటే వేచి చూడకతప్పదు మరి!


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని