జాగ్రత్తలు చెప్పి వివరాలు అడిగింది.. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై బెట్టింగులు ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి! అధికారులు, పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఓ చోట బెట్టింగ్‌ ఉదంతాలు బయటపడుతూనే ఉంటాయి. జట్టు అంతర్గత విషయాలు కూపీ లాగేందుకు ఆటగాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. యూఏఈ వేదికగా...

Published : 05 Jan 2021 19:02 IST

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై బెట్టింగులు ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి! అధికారులు, పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఓ చోట బెట్టింగ్‌ ఉదంతాలు బయటపడుతూనే ఉంటాయి. జట్టు అంతర్గత విషయాలు కూపీ లాగేందుకు ఆటగాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2020లోనూ ఓ ఆటగాడిని ఓ మహిళ జట్టు అంతర్గత విషయాలు అడిగిన విషయం తాజాగా బయటకొచ్చింది.

దిల్లీకి చెందిన ఓ నర్సు తానొక వైద్యురాలినని టీమ్‌ఇండియాకు ఆడిన క్రికెటర్‌ను సోషల్‌ మీడియాలో కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకుంది. అతడికి పెద్ద అభిమానిగా చెప్పుకుంది. కరోనా నేపథ్యంలో వైరస్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలని క్రికెటర్‌ ఆమెను ఆన్‌లైన్‌లో సంప్రదించాడు. కొన్ని సూచనలు చేసిన ఆమె సెప్టెంబర్‌ 30న జట్టు అంతర్గత విషయాల గురించి అడిగింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ క్రికెటర్‌ కోపాన్ని ప్రదర్శించే ఎమోజీతో బదులిచ్చాడు. పోలీసులకు చెబుతానని హెచ్చరించాడు. దాంతో ఆమె ఏడుస్తున్న ఏమోజీలను పెట్టి క్షమాపణలు కోరింది.

తనను అంతర్గత సమాచారం కోసం ఒకరు అడిగారన్న విషయాన్ని ఆ క్రికెటర్‌ బీసీసీఐ అవినీతి నిరోధకశాఖ (ఏసీయూ)కు వెంటనే చెప్పేశాడు. దాంతో దర్యాప్తు ఆరంభించిన ఏసీయూ ఆమెకు బెట్టింగ్‌ మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవని ధ్రువీకరించుకొంది. వ్యక్తిగత క్రికెట్‌ బెట్టింగ్‌ కాసేందుకే సమాచారం అడిగిందని తెలుసుకుంది. ఇంకెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా లేవా విచారించగా అలాంటివేమీ లేవని తేలింది. దాంతో వెంటనే ఆ కేసును మూసేశామని ఏసీయూ చీఫ్‌ అజిత్‌సింగ్‌ మీడియాకు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా మరో ఆటగాడినీ ఒకరు సంప్రదించగా ఈ విషయం బయటకు తెలిసింది.

ఇవీ చదవండి
రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్
జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్‌ఇండియా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని