Team India: టీమ్‌ఇండియా మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌గా ప్యాడీ అప్టన్‌!

రాబోయే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు టీమ్‌ఇండియా యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను మానసికంగా దృఢంగా...

Published : 26 Jul 2022 23:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు టీమ్‌ఇండియా యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆటగాళ్లను మానసికంగా దృఢంగా సంసిద్ధం చేసేందుకు 2011 నాటి మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టన్‌ను తిరిగి నియమించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అతడు వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న భారత జట్టుతో కలిసిఉన్నట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. అదే నిజమైతే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యే వరకు అప్టన్‌ టీమ్‌ఇండియాకు సేవలు అందించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఉపయోగపడతాడని భావించి హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. అప్టన్‌ను టీమ్‌ఇండియా మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌గా నియమించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ఓకే చెప్పడంతో జట్టు యాజమాన్యం ఆమేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడు తిరిగి భారత జట్టులో సహాయక సిబ్బందిగా కొనసాగే వీలుంది. కాగా, 2008 నుంచి 2011 వరకు టీమ్‌ఇండియాకు కోచ్‌గా పనిచేసిన గ్యారీ కిర్‌స్టెన్‌ సహాయక బృందంలో అప్టన్‌ కూడా ఉన్నాడు. అప్పుడు కూడా అతడు ఆటగాళ్లకు మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలోనే ధోనీ సారథ్యంలోని టీమ్‌ఇండియా అప్పుడు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచింది.

ఆ ప్రపంచకప్‌ తర్వాత అతడి గడువు ముగియడంతో తిరిగి దక్షిణాఫ్రికా జట్టులో చేరాడు. అనంతరం వివిధ లీగ్‌లు, ఇతర జట్లకు తన సేవలు అందించాడు. ఇక భారత టీ20 లీగ్‌లోనూ ద్రవిడ్‌ రాజస్థాన్‌ జట్టుకు కోచ్‌గా ఉన్నప్పుడు అప్టన్‌ను నియమించుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ద్రవిడ్‌ మళ్లీ అతడిని టీమ్‌ఇండియా జట్టుకు తీసుకురావాలనుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని