IPL 2022: ఆ నైపుణ్యాన్ని ధోనీ నుంచే నేర్చుకున్నా: సన్‌రైజర్స్‌ ఆటగాడు

ఒత్తిడి సమయాల్లోనూ ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసే అద్భుతమైన నైపుణ్యాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...

Published : 13 Mar 2022 01:41 IST

(Photo: Rahul Tripathi Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒత్తిడి సమయాల్లోనూ ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసే అద్భుతమైన నైపుణ్యాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి. గత నెల ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో ఈ మహారాష్ట్ర ఆటగాడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం రూ.8.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగా ఈవెంట్‌ ప్రారంభానికి ముందు ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడాడు.

రాహుల్‌ గతేడాది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడగా.. ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో కోల్‌కతాను ఘోర పరాజయం నుంచి తప్పించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 135/5 తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే, ఛేదనలో కోల్‌కతా సునాయాస విజయం సాధించేలా కనిపించినా చివరి క్షణాల్లో ఓటమి అంచున నిలిచింది. ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో ఓ భారీ సిక్సర్‌తో రాహుల్‌ మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ విషయంపైనే అతడు మాట్లాడుతూ ఒత్తిడిలో ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేయడం ధోనీ నుంచి నేర్చుకున్నానని తెలిపాడు.

‘ఆరోజు మ్యాచ్‌లో చివర్లో సిక్సర్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించడం నాకెంతో ప్రత్యేకం. అయితే, ఆరోజు క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌ చేసేటప్పుడు నేనేం ఒత్తిడికి గురవ్వలేదు. మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. మ్యాచ్‌ను గెలిపించాలని అనుకున్నా. భావోద్వేగాలన్నీ కడుపులోనే దాచుకున్నా. అలా ఒత్తిడిలోనూ ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసే నైపుణ్యాన్ని ధోనీ నుంచి నేర్చుకున్నా’ అని అతడు చెప్పుకొచ్చాడు. కాగా, రాహుల్‌ ఇప్పటివరకు టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకపోయినా ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు‌. క్లిష్ట సమయాల్లో అనూహ్యంగా రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఈ కారణం చేతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి అతడిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇంతకుముందు అతడు‌ ధోనీ సారథ్యంలో రైజింగ్‌ పుణె తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఆపై రాజస్థాన్‌, కోల్‌కతా జట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని