
Ravi Bishnoi : కుంబ్లే సార్.. సూచనల వల్లే ఈ స్థాయికి రాగలిగాను : రవి బిష్ణోయ్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సలహాల కారణంగానే నాణ్యమైన స్పిన్నర్‌గా రాణించగలుగుతున్నానని యువ ఆటగాడు రవి బిష్ణోయ్ అన్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లో అతడు తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించాడు.
‘‘మా జట్టు హెడ్ కోచ్ అనిల్ సర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన చెప్పిన సూచనలు స్పిన్నర్‌గా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ‘తీవ్ర ఒత్తిడిలోనూ నిరాశకు గురి కాకుండా జట్టు విజయం కోసం మన వంతు ప్రయత్నం చేయాలి. మైదానంలో ఒత్తిడికి గురి కాకుండా మన ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలి. ఎల్లప్పుడూ అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాలి’ అని చేప్పేవాడు. నేను మెరుగ్గా రాణించగలననే ఆత్మ విశ్వాసాన్ని పెంచింది ఆయనే’’ అని రవి బిష్ణోయ్ పేర్కొన్నాడు. అనిల్ కుంబ్లే ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
‘మరోసారి రాహుల్ భాయ్ సారథ్యంలో ఆడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందే అతడి కెప్టెన్సీలో ఆడిన అనుభవం నాకుంది. వేలానికి ముందే నన్ను లఖ్‌నవూ ఫ్రాంఛైజీ దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి గొప్ప అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో మా జట్టు విజయం కోసం శాయశక్తులా శ్రమిస్తాను’ అని బిష్ణోయ్ చెప్పాడు. గత సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఇటీవల బహిరంగ వేలంలోకి వచ్చాడు. అతడిని లఖ్‌నవూ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. దీంతో మరోసారి వీరిద్దరూ ఒకే జట్టు తరఫున ఆడనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ ద్వారా రవి బిష్ణోయ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే.