రోహిత్‌కు తీవ్రమైన గాయమైందా?

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరోసారి గాయపడితే ప్రమాదంలో పడే ఆస్కారం ఉందని మెడికల్‌ రిపోర్టుల చెబుతున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్ర్తి పేర్కొన్నాడు. ఆస్ర్టేలియా పర్యటనకు ప్రకటించిన జట్ల ఎంపికలో తన ప్రమేయం లేదని ఆదివారం ఓ జాతీయ మీడియాతో

Updated : 27 Feb 2024 18:26 IST

జట్ల ఎంపికపై స్పందించిన రవిశాస్ర్తి

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరోసారి గాయపడితే ప్రమాదంలో పడే ఆస్కారం ఉందని మెడికల్‌ రిపోర్టులు చెబుతున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన జట్ల ఎంపికలో తన ప్రమేయం లేదని ఆదివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వివరించాడు. టీమిండియా సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సెలక్షన్‌ కమిటీ ఇటీవల టీ20, వన్డే, టెస్టు జట్లను ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు ప్రకటించిన జట్లలో హిట్‌మ్యాన్‌కు చోటు దక్కలేదు. గాయం కారణంగా రోహిత్‌ను ఎంపిక చేయలేదని సెలక్షన్‌ కమిటీ తెలిపింది. అయితే జట్ల ఎంపికపై మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు సునీల్‌ జోషీ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

‘రోహిత్‌ ఎంపికకు సంబంధించి మెడికల్‌ రిపోర్టు ఆధారంగానే సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎంపికకు సంబంధించి మా ప్రమేయం ఏం లేదు’ అని రవిశాస్త్రి వివరించాడు. ‘సెలక్షన్‌ కమిటీలో భాగమైనప్పటీకీ ఈ విషయంలో నేను ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. రోహిత్‌ మరోసారి గాయపడితే మరింత ప్రమాదంలో పడతాడని మెడికల్‌ రిపోర్టులు సూచిస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నాడు.

యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో ముంబయి జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్‌ తోడకండరాల్లో గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో లీగులో తన జట్టు ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో అతడి తరఫున కీరన్‌ పోలార్డ్‌ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇదిలా ఉంటే శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌ గురించి పోలార్డ్‌ మాట్లాడాడు. ‘రోహిత్‌ గాయం నుంచి కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి అతడు జట్టుని నడిపిస్తాడని ఆశిస్తున్నాం’ అని పోలార్డ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని