Ramiz Raja: రమీజ్‌ రజాకి పదవీ గండం.. పీసీబీ ఛైర్మన్‌గిరీ నుంచి తప్పించడం ఖాయమేనా..?

స్వదేశం వేదికగా ఇంగ్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌ను పాక్‌ కోల్పోవడంతో అక్కడి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రేగాయి. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌తోపాటు పీసీబీ ఛైర్మన్‌పై వేటు వేయాలనే డిమాండ్లూ వచ్చాయి.   

Published : 18 Dec 2022 13:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సందర్భం ఉన్నా లేకపోయినా టీమ్‌ఇండియాపై అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌, మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రజా పదవిపై కత్తి వేలాడుతోంది. అతడు 2021లో పీసీబీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రమీజ్‌ రజా హయాంలో పాకిస్థాన్‌ టీ20ల్లో అద్భుత ప్రదర్శనే చేసింది. అయితే, తాజాగా ఇంగ్లాండ్‌ చేతిలో స్వదేశం వేదికగానే పాక్‌ ఘోర పరాభవాలను ఎదుర్కోవడంతో అతడిని పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అంతేకాకుండా క్రికెట్‌ బోర్డులో  రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది.  బోర్డులోని సభ్యులు కూడా అతడిని తొలగించడానికే మొగ్గు చూపుతున్నట్లు పాక్‌ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

‘‘అవును. బోర్డులో ఏదో జరగబోతోంది. మాజీ ఛైర్మన్‌ నజామ్‌ సేథి మరోసారి బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది. రమీజ్ రజాను తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని పీసీబీ మాజీ సభ్యుడు ఒకరు పేర్కొన్నాడు.

2018లో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పీటీఐ మెజార్టీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పుడు వెంటనే పీసీబీ ఛైర్మన్‌ పదవికి నజామ్‌ సేథి రాజీనామా చేశాడు. పీసీబీ రాజ్యాంగం ప్రకారం ఛైర్మన్‌ పదవిని దేశ ప్రధానమంత్రి నామినేట్‌ చేస్తారు. ఇమ్రాన్‌ ప్రభుత్వం పడిపోవడం.. కొత్త ప్రధానిగా షెహ్‌బాజ్‌ షరీఫ్‌ అధికారంలోకి వచ్చారు. దీంతో రజాను తప్పించడం ఖాయమనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని