Dhoni: కెరీర్ మొత్తంలో మహీ అదొక్కటే చేశాడు..

ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ధోనీలాంటి మేటి ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం కంగారు జట్టు ఎప్పుడూ ఆలోచించేదని చెప్పాడు..

Updated : 30 May 2021 11:34 IST

ఆస్ట్రేలియాకు అలాంటి ఆటగాడు లేడు: పాంటింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ధోనీలాంటి మేటి ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. అది టీ20 ప్రపంచకప్‌లో కంగారూలకు ప్రతికూలాంశమని అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం కంగారు జట్టు ఎప్పుడూ ఆలోచించేదని చెప్పాడు. ఫినిషర్‌ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అన్నాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు.

‘ధోనీ కెరీర్‌ సాగినంత కాలం ఆ ఒక్క స్థానంలోనే ఆడాడు. అక్కడ తనదైన ముద్ర వేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ కూడా అలాంటి ఆటగాళ్లే. తమ దేశాలకు, లేదా ఐపీఎల్‌ జట్లకు నిలకడగా విజయాలు అందిస్తున్నారు. వాళ్లిద్దరూ ఆయా స్థానాలకు పరిమితమయ్యారు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో సరైన ఫినిషర్‌ లేకపోడానికి ప్రధాన కారణం.. అందులో బాగా ఆడే ఆటగాళ్లంతా బిగ్‌బాష్‌ లీగ్‌లో టాప్‌ఆర్డర్‌లో ఆడటమే’ అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా జట్టులో ఫినిషర్‌ స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ లేరని, అలాంటి ఆటగాడి కోసమే వెతకాల్సి ఉందని మాజీ కెప్టెన్‌ వివరించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టోయినిస్‌లను మ్యాచ్‌ ఫినిషర్లుగా పరిగణించాల్సి ఉందా? అని పాంటింగ్‌ ఎదురు ప్రశ్నించాడు. ఆ ముగ్గురూ బిగ్‌బాష్‌లో టాప్‌ఆర్డర్‌లో ఆడతారని, వారిని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయమని ఆయా జట్లను కోరడం కష్టమని తెలిపాడు. కాగా, ఐపీఎల్‌లో దిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్న పాంటింగ్‌ స్టోయినిస్‌ను మ్యాచ్‌ ఫినిషర్‌గా చూడాలనుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే అతడిని ఇటీవల మిడిల్‌ ఆర్డర్‌లో పంపగా పలు విజయాలు సాధించాడని గుర్తుచేశాడు. సరైన ఆటగాళ్లను లోయర్‌ ఆర్డర్‌లో అలా ఆడిస్తేనే మంచి ఫినిషర్లుగా తయారవుతారని పాంటింగ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని