IPL 2023: ఐపీఎల్‌లో పంత్‌ ఆడకపోవడం.. దిల్లీకి లోటే: గంగూలీ

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ (rishabh pant) చికిత్స పొందుతున్నాడు. ఈసారి ఐపీఎల్‌ సీజన్‌లో (ipl 2023) ఆడటం కష్టమే. దిల్లీ జట్టుకు సారథిగా (delhi) ఉన్న పంత్‌ సీజన్‌కు దూరం కావడంపై సౌరభ్ గంగూలీ (sourav gabguly) స్పందించాడు.

Published : 11 Jan 2023 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషభ్‌ పంత్‌ (rishabh pant) ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు (ipl 2023) అందుబాటులో ఉండటం లేదు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ ఐపీఎల్‌ ఆడకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (sourav ganguly) అన్నాడు. ఇటీవల పంత్‌కు కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో మోకాలి లిగ్మెంట్‌కు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. గాయాలు మాని పంత్ పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మార్చి ఆఖరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దిల్లీ క్యాపిటల్స్‌కి రిషభ్‌ పంత్‌ స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంత్‌ ఐపీఎల్‌కు దూరమవ్వడం దిల్లీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సౌరభ్‌ గంగూలీ వెల్లడించాడు.

‘‘రిషభ్‌ పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం. అందువల్ల మనం ఏమీ చేయలేం. పంత్‌ ఐపీఎల్‌కి అందుబాటులో ఉండడు. దిల్లీ క్యాపిటల్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నాను. పంత్‌ లేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ మేము గొప్పగా రాణించడానికి ప్రయత్నిస్తాం’’ అని గంగూలీ పేర్కొన్నాడు.  గతేడాది అక్టోబరులో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిన విషయం తెలిసిందే. గంగూలీ దిల్లీ ఫ్రాంచైజీ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని