Rohit - Kohli: కోహ్లీ కోసం ఈ టెస్టును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాం: రోహిత్

టీమ్ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి శ్రీలంకతో జరిగే తొలి టెస్టు వందో మ్యాచ్‌ అయిన నేపథ్యంలో దాన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహించాలనుకుంటున్నట్లు నూతన...

Updated : 03 Mar 2022 16:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి శ్రీలంకతో జరిగే తొలి టెస్టు వందో మ్యాచ్‌ అయిన నేపథ్యంలో ఈ టెస్టును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తామని జట్టు సారథి రోహిత్‌ శర్మ మీడియాతో అన్నాడు. తొలి టెస్టుకు ముందు గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏ ఆటగాడైనా వంద టెస్టులు ఆడటం మామూలు విషయం కాదని, ఈ విషయంలో అతడు చాలా దూరం పయనించాడని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. ఇదో అద్భుతమైన ప్రయాణమని కొనియాడాడు.

‘టెస్టుల్లో విరాట్‌ అత్యద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పుడు టీమ్‌ఇండియా ముందుకు సాగుతున్న విషయంలో ఎన్నో మార్పులు తెచ్చాడు. అతడికి ఈ ప్రయాణం ఎంతో సంతోషాన్ని మిగిల్చి ఉంటుంది. రాబోయే రోజుల్లోనూ ఇలాగే ఉంటుంది. ఈ వందో టెస్టును అతడికి మరింత ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం. అందుకోసం ఈ మ్యాచ్‌ ఐదు రోజుల పాటు పూర్తిగా జరగాలని కోరుకుందాం. 2018లో మేం ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచాం. అదెంతో ప్రత్యేకం. అప్పుడు కోహ్లీనే కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే ఆటగాడిగా అతడికి మరిచిపోలేని ఇన్నింగ్స్‌ అంటే 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు సాధించిన శతకమే. కఠిన పరిస్థితుల్లో నిలబడి మూడంకెల స్కోర్‌ సాధించాడు’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

‘ఆ పర్యటనలో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి అక్కడి మైదానాల్లో ఆడారు. పరిస్థితులు కఠినమైన సవాళ్లు విసిరినా మోర్కెల్‌, స్టెయిన్‌ లాంటి బౌలర్లను తట్టుకొని కోహ్లీ నిలబడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించాడు. కోహ్లీ బ్యాటింగ్‌లో నేను గుర్తుపెట్టుకున్న అతిగొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఆ మ్యాచ్‌ ఒకటి. 2011లో టెస్టు క్రికెట్‌ మొదలెట్టి చాలా దూరం వచ్చాడు’ అని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు. తాను ఇప్పుడు జట్టు విజయాల కోసమే ఆలోచిస్తున్నానని, ఒక జట్టుగా టీమ్‌ఇండియా ఇప్పుడు మంచి స్థితిలో ఉందని చెప్పాడు. అందుకు విరాట్‌ కోహ్లీనే కారణమన్నాడు. అతడు టెస్టు జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాడని, ఇక్కడి నుంచి తాను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే తాము ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో మధ్యలో ఉన్నామని, ఇకపై ప్రతి గేమ్‌లోనూ విజయం సాధించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అలాగే తమ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలనుకుంటున్నట్లు రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని