ఆట..పాటలతో పాక్‌ క్రికెటర్లను అలరించా: సెహ్వాగ్‌

తన పాటలు, బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ ఆటగాళ్లను అలరించేవాడినని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. దాయాది క్రికెటర్లు తనను కిషోర్‌ కుమార్‌ పాటలు అడిగేవారని గుర్తు చేసుకున్నాడు....

Published : 06 Nov 2020 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పాటలు, బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ ఆటగాళ్లను అలరించేవాడినని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. దాయాది క్రికెటర్లు తనను కిషోర్‌ కుమార్‌ పాటలు అడిగేవారని గుర్తు చేసుకున్నాడు. క్రిక్‌బజ్‌ కార్యక్రమంలో వీరూ ఆనాటి సంగతులు వివరించాడు.

మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన మూడ్‌ బాగు చేసుకొనేందుకు, జోరు పెంచేందుకు ‘మేరే జీవన్‌ సాతి’ చిత్రంలో కిషోర్‌ కుమార్‌ ఆలపించిన ‘చలా జాతా హూ’ పాట పాడేవాడినని సెహ్వాగ్‌ అన్నాడు. స్కోరు బోర్డుపై పరుగుల వేగం పెంచేందుకు ఇంకా మరెన్నో బాలీవుడ్‌ పాటలు ఆలపించేవాడినని పేర్కొన్నాడు. బ్యాటు నుంచి పరుగులు జాలు వారనప్పుడు దేవుడి భజన కీర్తనలూ పాడేవాడినని గుర్తు చేసుకున్నాడు.

‘బ్యాటింగ్‌ చేసేటప్పుడు పాటలు పాడటం నా అలవాటు. చలా జాతా హూ కిసీ కే ధూన్‌ మే, ధడక్తే దిల్‌ కే అనేది నాకిష్టమైన పాట. నేనెలాంటి మూడ్‌లో ఉన్నా ఇదే పాట పాడతాను. దాంతో నాకు ప్రేరణ కలుగుతుంది. అప్పుడప్పుడు పరుగులు రాకుంటే దేవుడి కీర్తనలు గుర్తుకు తెచ్చుకుంటా’ అని వీరూ చెప్పాడు. పాకిస్థాన్‌ మాజీ ఓపెనర్‌ యాసిర్‌ అహ్మద్‌ తనను పాట పాడమని కోరిన సంఘటనను అతడు గుర్తు చేసుకున్నాడు.

‘నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు పాటలు పాడతానని బయటివాళ్లకు తెలియదు. కానీ భారత్-పాకిస్థాన్‌ సిరీసులో ఇది జరిగింది. బెంగళూరులో నేను 150 పరుగుల వద్ద ఉన్నాను. యాసిర్‌ అహ్మద్‌ షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. వీరూభాయ్‌, మీరు బ్యాటింగ్‌ చేస్తూ పాటలు పాడతారా అని ప్రశ్నించాడు. నేను అవునన్నాను. అప్పుడతను కిషోర్‌ కుమార్‌ పాట పాడాలని కోరాడు. అలా నా బ్యాటింగ్‌, పాటలతో పాకిస్థాన్‌ ఆటగాళ్లను అలరించేవాడిని’ అని వీరూ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని