సైని × శార్దూల్‌.. ఎవరికి చోటు?

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియా మరో తలనొప్పి! గాయపడ్డ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని ఆడించాలా అని జట్టు యాజమాన్యం తల పట్టుకొంది. యువపేసర్‌ నవదీప్‌ సైని, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల శార్దూల్‌ ఠాకూర్‌లో ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధం నెలకొంది. ఫామ్‌లేమితో....

Updated : 05 Jan 2021 18:38 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియాకు మరో తలనొప్పి! గాయపడ్డ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని ఆడించాలా అని జట్టు యాజమాన్యం తల పట్టుకొంది. యువపేసర్‌ నవదీప్‌ సైని, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల శార్దూల్‌ ఠాకూర్‌లో ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధం నెలకొంది. ఫామ్‌లేమితో సతమతం అవుతున్న మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్‌ శర్మ రావడం ఖాయమైంది. స్థిరంగా, నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి హిట్‌మ్యాన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గత ఎనిమిది టెస్టు ఇన్నింగ్సుల్లో ఏడింట్లో విఫలం కావడంతో మయాంక్‌ చోటు కోల్పోక తప్పడం లేదు.

కొన్ని రోజుల క్రితం శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమని చర్చ నడిచింది. కాగా అత్యంత వేగంగా బంతులు విసరగల సైనిని తీసుకుంటే బాగుంటుందని టీమ్‌ఇండియా సీనియర్లు భావిస్తున్నారని సమాచారం. మంగళవారం సిడ్నీ క్రికెట్‌ పిచ్‌పై కవర్లు తొలగించకపోవడంతో బౌలింగ్‌ విభాగంపై అంచనాకు రాలేకపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పిచ్‌పై కవర్లు తొలగించలేదు. ఒకవేళ పిచ్‌పై తేమ ఉంటే ఠాకూర్‌ను తీసుకోవచ్చు. ఫ్లాట్‌గా ఉంటే మాత్రం పాత బంతిని రివర్స్‌స్వింగ్‌ చేయగల సైనికే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఆసీస్‌ను దెబ్బకొట్టొచ్చన్నది టీమ్‌ఇండియా ప్రణాళిక.

సైనికి జట్టులో చోటు దక్కితే అతడు అరంగేట్రం చేస్తాడు. శార్దూల్‌ ఠాకూర్‌కూ ఇదొక అరంగేట్రం లాంటిదే. ఎందుకంటే రెండేళ్ల క్రితం అతనాడిన తొలి మ్యాచులో తొలి ఓవర్‌ పూర్తికాకముందే గాయంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టులో చోటు లభించలేదు. తాజాగా మూడో పేసర్‌ స్థానంలో నటరాజన్‌ పేరూ వినిపిస్తోంది. తెలుపు రంగు జెర్సీలో అతడు ఫొటోషూట్‌లో పాల్గొనడం చర్చకు తావిచ్చింది. 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులాడిన నట్టూ ఏడాది క్రితం దేశవాళీలో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడాడు. చెపాక్‌ వేదికగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచులో 11 ఓవర్లు విసిరి మూడు వికెట్లు తీశాడు. మొత్తానికి మూడో టెస్టులో మూడో పేసర్‌ ఎవరో తెలుసుకొనేందుకు బుధవారం వరకు ఆగాల్సిందే.

టీమ్‌ఇండియా అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (సారథి), హనుమ విహారి, రిషభ్‌ పంత్ ‌(కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌/నవదీప్‌ సైని

ఇవీ చదవండి
రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్
జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్‌ఇండియా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని