T20 World Cup: దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్‌కు ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.  అయితే నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో దక్షిణాఫ్రికా గెలిచినప్పటికీ సెమీస్‌ రేస్‌ నుంచి తప్పుకుంది. 

Updated : 07 Nov 2021 00:43 IST

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండూ అగ్రశ్రేణి జట్లే. సమాన విజయాలతో సెమీస్‌ కోసం బరిలోకి దిగిన రెండూ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి. అయితే ఈ రెండు జట్లలో సెమీస్‌ చేరుకునేందుకు ఒక జట్టుకే అవకాశం ఉండడంతో నెట్‌రన్‌రేట్‌ కారణంగా ఆసీస్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్‌ రబాడ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.  

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డస్సెన్ (94 నాటౌట్‌), మార్‌క్రమ్‌(52) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో మొయిన్‌ అలీ(37) టాప్‌ స్కోరర్‌. అయితే మిగతావారు కూడా గెలుపుకోసం తమవంతు ప్రయత్నం చేయడంతో ఇంగ్లాండ్‌ గెలుపు దిశగా సాగింది. ఇంగ్లాండ్‌ విజయానికి చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు అవసరం కాగా 19 ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి.  ఇక చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌కు 14 పరుగులు అవసరం కాగా  కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి.  రబాడ అద్భుతంగా  బౌలింగ్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. మొదటి మూడు బంతుల్లో వోక్స్‌, మోర్గాన్‌, జోర్డాన్‌ను పెవిలియన్‌ పంపించాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్‌ గెలిచేందుకు అవకాశం ఉండడంతో రబాడ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మిగతా మూడు బంతుల్లో కేవలం మూడు పరుగులే ఇచ్చి ఇంగ్లాండ్‌ను నిలువరించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ డస్సెన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. 

దక్షిణాఫ్రికా బ్యాటర్ల ఉగ్రరూపం..

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేశారు. సౌతాఫ్రికా ఓపెనర్‌ హెడ్రిక్స్‌ (2) విఫలమైనా.. ఆ ప్రభావం స్కోరు బోర్డు మీద పడలేదు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన డస్సెన్ (94*: ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మరో ఓపెనర్‌ డికాక్‌ (34) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి 71 పరుగుల జోడించారు. డికాక్‌ పెవిలియన్‌కు చేరిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్‌క్రమ్‌ (52: రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అగ్నికి వాయువు తోడైనట్లు డస్సెన్‌తో కలిసి వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ 52 బంతుల్లోనే శతకం భాగస్వామ్యం (103) నిర్మించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు క్రిస్‌ వోక్స్‌ (4-0-43-0), మార్క్‌ వుడ్ (4-0-47-0), క్రిస్‌ జొర్డాన్‌ (4-0-36-0) ప్రభావం చూపలేకపోయారు. మొయిన్‌ అలీ (4-0-27-1), అదిల్‌ రషీద్‌ (4-0-32-1) మాత్రమే వికెట్లు తీయగలిగారు. అయితే  ఇంగ్లాండ్‌ ఇంతకుముందే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా,  ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను దక్షిణాఫ్రికా 130 పరుగులకే కట్టడి చేస్తే నెట్‌రన్‌రేట్‌ కారణంగా ఆ జట్టుకు సెమీస్‌లోకి అడుగుపెట్టేందుకు వీలుపడేది. అయితే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం కోసం ప్రాణం పెట్టాయి.   దక్షిణాఫ్రికా బౌలర్‌ రబాడ  చివరి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి హ్యాట్రిక్‌ తీయడంతో దక్షిణాఫ్రికా గెలిచింది. అయినప్పటికీ సెమీస్‌ రేసు  నుంచి తప్పుకుంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని