Wrestlers Protest: ‘మీడియా ముందుకెళ్లొద్దు’.. బ్రిజ్‌ భూషణ్‌కు క్రీడల మంత్రి ఫోన్‌..?

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan) మీడియా సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఆయన విలేకరులతో మాట్లాడకుండా కేంద్రం నిలువరించినట్లు తెలుస్తోంది.

Updated : 20 Jan 2023 17:33 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan) శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయనను కేంద్రం నిలువరించినట్లు తెలుస్తోంది. మీడియా ముందుకెళ్లొద్దంటూ బ్రిజ్‌ భూషణ్‌కు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) ఫోన్‌ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రెజ్లర్ల ఆరోపణలను ముందు నుంచీ ఖండిస్తున్న బ్రిజ్ భూషణ్‌ ఈ ఉదయం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ కుట్ర వివరాలన్నీ బయటపెడతానని వెల్లడించారు. అయితే సమయం దాటినా ఆయన మీడియా ముందుకు రాలేదు.

కాగా.. వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. మీడియా ముందుకెళ్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయని ఆయన వారించినట్లు సమాచారం. మరి క్రీడల మంత్రి సూచన మేరకు డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) అధ్యక్షుడు మీడియా సమావేశాన్ని విరమించుకున్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిజ్‌ భూషణ్‌ చెబుతున్నారు.

ఇదీ చదవండి: కుస్తీ యోధుల ఆగ్రహ జ్వాల.. ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌..?

పీటీ ఉష అత్యవసర సమావేశం..

ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న రెజ్లర్లు నేడు భారత ఒలింపిక్‌ సంఘానికి (ఐఓఏ IOA) ఫిర్యాదు చేశారు. రెజ్లింగ్‌ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ఫిర్యాదుపై చర్చించేందుకు ఐఓఏ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం 5.45కు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది.

కేంద్రమంత్రితో మరోసారి భేటీ..

అటు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు నేడు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో మరోసారి భేటీ కానున్నారు. రెజ్లర్ల (Wrestlers) నిరసన తీవ్రం కావడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. భజ్‌రంగ్‌ పునియా, రవి దహియా, వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ వంటి అగ్రశ్రేణి అథ్లెట్లతో తన నివాసంలో నిన్న రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే అవి ఫలించకపోవడంతో నేడు మరోసారి సమావేశం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని