Sri Lanka cricket board: శ్రీలంక క్రికెట్‌ బోర్డును పునరుద్ధరించిన కోర్టు..!

శ్రీలంక క్రికెట్‌ బోర్డును ఆ దేశ న్యాయస్థానం పునరుద్ధరించింది. లంక క్రీడల మంత్రి రోషన్‌ రణసింఘె ఆదేశాలను కొట్టేసింది. ఈ కేసును త్వరలోనే పూర్తిస్థాయిలో విచారిస్తామని పేర్కొంది.   

Updated : 07 Nov 2023 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సీ)ను రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రి రోషన్‌ రణసింఘె తీసుకొన్న నిర్ణయాన్ని నేడు అప్పీళ్ల కోర్టు కొట్టేసింది. దీంతో ఆ దేశ క్రికెట్‌ బోర్డు (Sri Lanka cricket board)ను పునరుద్ధరించినట్లైంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ పెండింగ్‌లో ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. దీనిలో భాగంగా క్రీడా మంత్రి నిర్ణయాన్ని సవాలు చేస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. 

ఈ క్రమంలో రోషన్‌ రణసింఘె నిర్ణయాన్ని కొట్టేసింది. సిల్వా పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణను పెండింగ్‌ ఉంచింది. ‘‘పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ప్రస్తుతానికి బోర్డును రెండు వారాలపాటు పునరుద్ధరించారు’’ అని కోర్టు అధికారులు వెల్లడించారు. దీంతో జట్టు మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ నేతృత్వంలోని సరికొత్త కమిటీ విధులను చేపట్టకుండా బోర్డు ఆపినట్లైంది. ఇక ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు విధుల్లోకి తిరిగి చేరాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 

మాథ్యూస్‌ ‘టైమ్‌డ్‌’ ఔట్‌.. నేనైతే ఎలాంటి అప్పీలు చేయను: మాజీ పేసర్

గత కొంత కాలంగా లంక బోర్డుపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ దేశ క్రీడల మంత్రి రణసింఘె బోర్డును తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బోర్డును రద్దు చేసి రణతుంగా నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ‘శ్రీలంక క్రికెట్‌ బోర్డు దేశంలోనే అత్యంత అవినీతి మయమైన సంస్థ. నేను దీనిని మార్చాలనుకుంటున్నాను’ అని సోమవారం రణతుంగ వ్యాఖ్యానించారు. 2008లోనూ ఎస్‌ఎల్‌సీ వ్యవహారాల నిర్వహణకు ఏర్పాటు చేసిన మధ్యంత కమిటీకి రణతుంగ ఛైర్మన్‌గా వ్యవహరించాడు.

ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)పై వేటు పడింది.  క్రికెట్‌ బాధ్యతలను ఏడుగురు సభ్యుల మధ్యంతర కమిటీని  ఏర్పాటు చేసి అప్పగించారు. ఈనెల 2న ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 302 పరుగుల తేడాతో భారత్‌ చేతిలో ఓడింది. ఈ పరాజయం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఎస్‌ఎల్‌సీ కమిటీని రద్దుచేస్తూ క్రీడల మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు రిటైర్డ్‌ న్యాయమూర్తులు, ఇద్దరు మహిళలు, ఎస్‌ఎల్‌సీ మాజీ అధ్యక్షుడు ఉపాలి ధర్మదాస ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని