BAN vs SL: మాథ్యూస్‌ ‘టైమ్‌డ్‌’ ఔట్‌.. నేనైతే ఎలాంటి అప్పీలు చేయను: మాజీ పేసర్

మాథ్యూస్‌ ఔట్‌ విషయంలో షకిబ్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే, అతడు వ్యవహరించిన తీరు ఆశ్చర్యపర్చలేదని టీమ్‌ఇండియా మాజీ పేసర్ వ్యాఖ్యానించాడు. దానికి కారణంగా షకిబ్‌ తీరే అలా ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నాడు.

Published : 07 Nov 2023 14:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్‌ను ‘టైమ్‌డ్‌ ఔట్’ చేయడంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబ్ కీలక నిర్ణయమే కారణం. అంపైర్ల వద్ద అప్పీలు చేసి మరీ వికెట్‌ను సాధించాడు. వరల్డ్‌ కప్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ విధంగా టైమ్‌డ్‌ ఔట్‌ అయిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్‌ నిలిచాడు. ఇప్పటికే మాథ్యూస్‌ బంగ్లాజట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు. సోషల్‌ మీడియాలోనూ షకిబ్‌ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత మాజీ పేసర్‌ వెంకటేశ్ ప్రసాద్ అయితే ఇందులో తనకేమీ ఆశ్చర్యమనిపించలేదని ట్వీట్ చేశాడు. షకిబ్‌ నుంచి ఇలాంటి నిర్ణయం రావడం సర్‌ప్రైజ్‌ కాదని పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు స్టీవ్ హార్మిసన్‌ కూడా తనకే ఇలాంటి అవకాశం వచ్చినా అప్పీలు చేయనని వ్యాఖ్యానించాడు. 

‘‘మాథ్యూస్‌ గడువులోగానే క్రీజ్‌లోకి వచ్చాడు. కాకపోతే గార్డ్‌ను తీసుకోలేదు. క్రీజ్‌లోనే నిల్చుని హెల్మెట్‌ను సరి చేసుకున్నాడు. కాబట్టి ఇందులో ఎక్కడా కావాలని చేసినట్లు అనిపించలేదు. అందుకే, ఏంజెలో మాథ్యూస్‌ విషయంలో పొరపాటు జరిగింది. ఒకవేళ నేనైతే అప్పీలు చేయను. ఆ వ్యవహారమంతా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మాథ్యూస్‌ ఇలా ఔట్‌ కావడం తీవ్రంగా నిరాశపరిచింది’’ అని హార్మిసన్‌ తెలిపాడు.

నాకేం ఆశ్చర్యం కలగలేదు: వెంకటేశ్‌ ప్రసాద్

‘‘ఇదంతా స్వచ్ఛమైన క్రికెటింగ్‌ పరిజ్ఞానం. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో షకిబ్ ఒకడిగా పరిగణిస్తుంటారు. అయితే, 2019 వరల్డ్‌ కప్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌కు రిపోర్ట్‌ చేయడంలో విఫలం కావడం, గేమ్‌ కంటే తానే పెద్దగా భావించడం, అంపైర్లను బెదిరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి, శ్రీలంకతో మ్యాచ్‌లో అతడి చర్య నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు’’ అని వెంకటేశ్‌ ప్రసాద్ ట్వీట్ చేశాడు. ‘‘విజయం సాధించాలని నమ్మాలి. కానీ, ఎలాగైనా గెలుస్తానని అనుకోకూడదు. అదంతా సిగ్గుమాలిన చర్య’’ అని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్‌ కైఫ్‌ వ్యాఖ్యానించాడు.

‘‘దిల్లీ వేదికగా జరిగిన ఈ సంఘటన అత్యంత దారుణం’’ - గంభీర్‌

‘‘ఇది సరైంది కాదు. వాతావరణం వేడెక్కింది’’ - డేల్‌ స్టెయిన్‌

‘‘ఏంజెలో మాథ్యూస్‌ క్రీజ్‌లోకి వచ్చాక తన హెల్మెట్ స్ట్రాప్‌ పోయిందని గ్రహించాడు. అప్పుడు టైమ్డ్‌ ఔట్‌ అని ఎలా భావిస్తారు? అతడు క్రీజ్‌లోకి రాకపోతే నేను కూడా టైమ్డ్‌ ఔట్‌ అని చెబుతా. కానీ, ఇక్కడ అలా జరగలేదు’’ - ఉస్మాన్‌ ఖవాజా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని