Badminton : శ్రీకాంత్‌ ముందంజ.. సింధు, సైనా నిష్క్రమణ

జర్మన్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ మరో ముందడుగు వేశాడు. మహిళల విభాగంలో..

Published : 10 Mar 2022 21:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : జర్మన్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ మరో ముందడుగు వేశాడు. మహిళల విభాగంలో ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

గురువారం (మార్చి 10న) జరిగిన రెండో రౌండ్‌ పోరులో చైనా ఆటగాడు లు గ్వాంగ్‌ జుపై 21-16, 21-23, 21-18 తేడాతో శ్రీకాంత్‌ గెలుపొందాడు. పోటాపోటీగా జరిగిన తొలి సెట్లో పై చేయి సాధించిన శ్రీకాంత్‌.. తర్వాతి సెట్లో వెనుకబడిపోయాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో స్వల్ప తేడాతో గ్వాంగ్ జు ను ఓడించాడు. తర్వాతి రౌండ్‌లో డెన్మార్క్‌కి చెందిన ఒలింపిక్‌ ఛాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌తో శ్రీకాంత్ తలపడనున్నాడు.

* నిరాశపరిచిన సింధు..

ఏడో సీడ్‌ పీవీ సింధు జర్మన్‌ ఓపెన్‌ రెండో రౌండ్లోనే ఓటమి పాలై నిరాశపరిచింది. చైనా ప్రత్యర్థి ఝాంగ్ యి మన్‌తో జరిగిన ఈ మ్యాచులో సింధు 14-21, 21-15, 14-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి సెట్లో ఓ దశలో 5-5 పాయింట్లతో సమంగా సాగుతున్న మ్యాచులో ఝాంగ్ అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఆరు పాయింట్లు సాధించి 5-11 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వా అదే దూకుడును కొనసాగిస్తూ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో సింధు కాస్త పుంజుకుని పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో ఝాంగ్‌ దూకుడుగా ఆడుతూ సింధుని ఓడించి.. తదుపరి రౌండ్‌కి అర్హత సాధించింది.

* సైనా కూడా అదే బాటలో..

ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న సైనా నెహ్వాల్ జర్మన్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. థాయ్‌లాండ్‌కి చెందిన ఎనిమిదో సీడ్‌ రచనోక్‌ ఇంటనాన్‌తో జరిగిన మ్యాచులో 10-21, 15-21 వరుస సెట్లలో సైనా ఓటమి పాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని