IND vs AUS: అహ్మదాబాద్‌ పిచ్‌.. సిబ్బంది ఒకరు నాతో ఇలా అన్నారు: స్టీవ్‌ స్మిత్

IND vs AUS: భారీ ప్రేక్షక సామర్థ్యం కలిగిన మైదానంలో భారత్ - ఆసీస్‌ (IND vs AUS) జట్ల మధ్య కీలక సమరం గురువారం నుంచి ప్రారంభం కానుంది. పిచ్‌ పరిస్థితిపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.

Published : 08 Mar 2023 20:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) టెస్టు సిరీస్‌లో గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానాల్లో ఒకటైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో టెస్టు జరగనుంది. అయితే పిచ్‌ ఎలా ఉంటుందనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.  తాజాగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ పిచ్‌ను పరిశీలించాడు. గత మూడు టెస్టుల్లో వాడిన పిచ్‌లతో పోలిస్తే.. అహ్మదాబాద్ పిచ్‌ తొలి రోజు ఫ్లాట్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మ్యాచ్‌ జరిగే కొద్దీ పగుళ్లు ఏర్పడి బంతి టర్న్‌ అవుతుందని తెలిపాడు. 

‘‘మైదానంలోని నాలుగు వికెట్లను (పిచ్‌లు) పరిశీలించా. తొలి రోజు ఫ్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనిపిస్తోంది. వాతావరణం వేడిగా ఉండటంతో మ్యాచ్‌ జరిగే కొద్దీ బంతి టర్న్‌ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇవాళ 38 డిగ్రీలకుపైగా ఎండ ఉంది. మరోసారి వాటరింగ్‌ చేస్తామని మైదానం సిబ్బందిలో ఒకరు నాతో చెప్పారు. తప్పకుండా ఈ పిచ్‌ కాస్త భిన్నంగా ఉంటుందని భావిస్తున్నా. తొలి బంతి నుంచే బంతి విపరీతంగా తిరగదు. అందుకే భారీ స్కోర్లు నమోదు అవుతాయని అనుకుంటున్నా. ఎలాంటి పిచ్‌ మీదైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటాం. కఠిన పిచ్‌పై 200 పరుగులు చేసినా మంచి స్కోరే అవుతుంది. అంతేకానీ, మేం పిచ్‌ పరిస్థితి గురించి ఫిర్యాదులు చేయము. వ్యక్తిగతంగా నేను క్లిష్టపరిస్థితుల్లో ఆడటాన్ని మరింత ఆనందిస్తా’’ అని స్మిత్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని