IND vs BAN: ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే గెలిచేవారు: సునీల్‌ గావస్కర్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil gavaskar) రాహుల్‌కు తన మద్దతు తెలిపాడు. 

Published : 07 Dec 2022 01:04 IST

దిల్లీ: బంగ్లాదేశ్‌(Bangladesh)తో తొలి వన్డేలో పేలవమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన టీమ్‌ఇండియా(Team india).. 41.2 ఓవర్లలో 186 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. బౌలింగ్‌ పరంగా రాణించినప్పటికీ బంగ్లా ఆటగాళ్లు మెహదీ హసన్‌(Mehidy hasan), ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ జోరు ముందు భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. ఫీల్డింగ్‌ పరంగానూ తేలిపోయారు. చివరి ఓవర్‌లో క్యాచ్‌ను వదిలేసి జట్టు ఓటమికి కారణమయ్యాడంటూ కేఎల్‌ రాహుల్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil gavaskar) రాహుల్‌ పక్షాన నిలిచాడు. 

‘‘ఈ విషయంలో రాహుల్‌ క్యాచ్‌ అంశాన్ని మాత్రమే తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే, ఇది మ్యాచ్‌లో చివరి వికెట్‌. దానితో గేమ్‌ పూర్తవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భారత స్కోరు 186 మాత్రమే. ఈ విషయంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌ పరంగా మనవాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఆ తర్వాత హసన్‌ మిరాజ్‌ రావడం, చివరి క్యాచ్‌ను మనవాళ్లు వదిలేయడం వంటివి వారికి కలిసొచ్చాయి. కానీ, అతడు గొప్పగా ఆడాడు. ఆ జట్టు తెలివైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థిపై దాడిని కొనసాగించింది’’అని గావస్కర్‌ కొనియాడాడు. 
టీమ్‌ఇండియా ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ.. బంగ్లాదేశ్‌కు చెప్పినట్టుగా ఒక ఓవర్‌లో నాలుగు పరుగుల కన్నా తక్కువ ఛేదిస్తే సరిపోతుందంటే కచ్చితంగా ఆటగాళ్లు కాస్త తేలికపడతారు. ఇదే అవకాశంగా వారు చాలా జాగ్రత్తగా ఆడి భారత్‌ను చిక్కుల్లోకి నెట్టారు. మనవాళ్లు మరో 70-80 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆ తప్పిదమే ఓటమికి కారణమైంది’’ అంటూ ఈ మాజీ కెప్టెన్‌ పేర్కొన్నాడు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని