SKY: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరువగా సూర్యకుమార్‌

టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం సుస్థిరం చేసుకొన్నాడు. అయితే పాయింట్లను గణనీయంగా మెరుగుపర్చుకొని నంబర్‌వన్‌ వైపు దూసుకెళ్తున్నాడు.

Published : 06 Oct 2022 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ20 సిరీసుల్లో రాణించిన టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్థానం సుస్థిరం చేసుకొన్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ (838 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే పాయింట్ల పరంగా తొలి స్థానంలో నిలిచిన పాక్‌ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్  (854 పాయింట్లు)కు చేరువగా వస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై మూడు టీ20ల్లో రెండు అర్ధశతకాలు సాధించిన సూర్యకుమార్‌ వచ్చే ప్రపంచకప్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తే తొలి ర్యాంక్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు రిజ్వాన్‌ కూడా ఇంగ్లాండ్‌తో ఏడు టీ20ల సిరీస్‌లో 316 పరుగులు చేశాడు. అయితే ఆరో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకోవడంతో రిజ్వాన్‌కు పాయింట్లలో పెరుగుదల నమోదు కాలేదు. 

టీ20ల్లో టాప్‌-10 జాబితాలో భారత్‌ నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే నిలవడం గమనార్హం. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్ (606 పాయింట్లు) ఏడు స్థానాలను మెరుగుపర్చుకొని 14వ స్థానంలో.. విరాట్ కోహ్లీ (605) 15వ స్థానంలో, రోహిత్ శర్మ (604) 16వ స్థానంలో ఉన్నారు. బాబర్ అజామ్ (801) మూడో ర్యాంక్, దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐదెన్ మార్‌క్రమ్‌ (777) నాలుగో ర్యాంక్, ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ (733) ఐదో ర్యాంక్‌లో నిలిచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని