Kolkata vs Bangalore : చెమటోడ్చి నెగ్గిన బెంగళూరు..

టీ20 మెగా టోర్నీలో బెంగళూరు బోణీ కొట్టింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచులో 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది...

Updated : 30 Mar 2022 23:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో బెంగళూరు బోణీ కొట్టింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో షాబాజ్‌ అహ్మద్‌ (27 : 20 బంతుల్లో 3×6), రూథర్‌ఫర్డ్‌ (28) కీలక ఇన్నింగ్సులు ఆడారు. డుప్లెసిస్‌ (5), అనుజ్‌ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), డేవిడ్‌ విల్లే (18), వనిందు హసరంగ (4) పరుగులు చేశారు. దినేశ్‌ కార్తిక్ (14), హర్షల్ పటేల్ (10) నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, సునీల్ నరైన్, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. 


ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఉత్కంఠగా మ్యాచ్‌

బెంగళూరు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. టిమ్‌ సౌథీ వేసిన 18వ ఓవర్లో రెండో బంతికి రూథర్‌ ఫర్డ్‌ (28) కీపర్‌కి చిక్కగా.. ఐదో బంతికి వనిందు హసరంగ (3) రసెల్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో మ్యాచు ఉత్కంఠగా మారింది. బెంగళూరు విజయానికి ఇంకా 17 పరుగులు కావాలి. ప్రస్తుతం దినేశ్‌ కార్తిక్‌ (3), హర్షల్ పటేల్ (1) క్రీజులో ఉన్నారు.


నెమ్మదిగా బ్యాటింగ్‌..

స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాటర్లు నెమ్మదిగా ఆడుతున్నారు. వరుణ్‌ చక్రవర్తి వేసిన 10వ ఓవర్లో రెండో బంతిని బౌండరీకి తరలించిన డేవిడ్ విల్లే (18).. సునీల్ నరైన్‌ వేసిన 11వ ఓవర్లో ఆఖరు బంతికి నితీశ్‌ రాణాకి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో మూడో బంతిని రూథర్ ఫర్డ్‌ (25) బౌండరీకి తరలించాడు. రసెల్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో షాబాజ్‌ అహ్మద్‌ (17) రెండు సిక్సులు బెంగళూరుపై ఒత్తిడి తగ్గించాడు. 14వ ఓవర్లో ఉమేశ్ యాదవ్‌ నాలుగే పరుగులు ఇచ్చాడు. దీంతో 14 ఓవర్లకు బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. బెంగళూరు విజయానికి ఇంకా 40 పరుగుల దూరంలో ఉంది. 


ఆచితూచి ఆడుతున్న బెంగళూరు బ్యాటర్లు..

ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. ఉమేశ్ యాదవ్ వేసిన ఐదో ఓవర్లో ఒకే పరుగు ఇచ్చాడు. ఆరో ఓవర్లో డేవిడ్‌ విల్లే (13) ఓ ఫోర్‌ బాదాడు. ఏడో ఓవర్లో సునీల్ నరైన్‌ నాలుగు పరుగులు ఇవ్వగా.. ఆ తర్వాతి ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ సహా 12 పరుగులు ఇచ్చాడు. తొమ్మిదో ఓవర్లో ఒకే పరుగు వచ్చింది. రూథర్‌ ఫర్డ్‌ (13) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు బెంగళూరు స్కోరు 53/3 గా నమోదైంది.


బెంగళూరు 3 వికెట్లు డౌన్‌
బౌలింగ్‌తో అదరగొట్టిన బెంగళూరు జట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతోంది. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ అనుజ్‌ రావత్‌ (0) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో ఓవర్‌ చివరి బంతికి సౌథీ బౌలింగ్‌లో డుప్లెసిస్‌ (5) రహానెకు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో తొలి బంతికే ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కోహ్లీ (12) కీపర్‌కి చిక్కాడు. దీంతో బెంగళూరు జట్టు 4 ఓవర్లు పూర్తయ్యే సరికి 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. డేవిడథ్‌ విల్లే (0), రూథర్‌ఫర్డ్ (3) క్రీజులో ఉన్నారు.


కోల్‌కతా బ్యాటింగ్‌ పూర్తి.. బెంగళూరు ముందు స్వల్ప లక్ష్యం..

ముంబయిలోని డీవై పాటిల్ మైదానంలో జరుగుతున్న మ్యాచులో బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. దీంతో కోల్‌కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు ముందు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా బ్యాటర్లలో ఆండ్రూ రసెల్‌ (25) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్‌ (18) పరుగులు చేశాడు. ఓపెనర్లు అజింక్య రహానె (9),  వెంకటేశ్ అయ్యర్‌ (10), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ (13), నితీశ్ రాణా (10), సునీల్ నరైన్ (12), సామ్ బిల్లింగ్స్‌ (14), షెల్డన్ జాక్సన్‌ (0) డకౌట్ కాగా, టిమ్ సౌథీ ఒక పరుగు చేశాడు. వరుణ్‌ చక్రవర్తి (10) నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ నాలుగు, ఆకాశ్ దీప్‌ మూడు, హర్షల్ పటేల్‌ రెండు, మహమ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టారు.


బిల్లింగ్స్‌, రసెల్‌ ఔట్..

బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ కోల్‌కతాను కట్టడి చేస్తున్నారు. హర్షల్ పటేల్ వేసిన 12వ ఓవర్లో సామ్‌ బిల్లింగ్స్‌ (14)ని ఔట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన అతడు విరాట్ కోహ్లీకి చిక్కి క్రీజు వీడాడు. అంతకు ముందు సిరాజ్ వేసిన పదో ఓవర్లో ఓ ఫోర్‌ బాదిన ఆండ్రూ రసెల్‌.. హసరంగ వేసిన 11వ ఓవర్లో ఓ సిక్స్ బాదాడు. షాబాజ్ అహ్మద్‌ వేసిన 13వ ఓవర్లో రస్సెల్‌ (25) మరో రెండు సిక్సులు బాదాడు. హర్షల్‌ పటేల్ వేసిన 14వ ఓవర్లో ఐదో బంతికి రసెల్ కీపర్‌కి చిక్కాడు. ప్రస్తుతం, ఉమేశ్ యాదవ్ (0), టిమ్‌ సౌథీ (0) క్రీజులో ఉన్నారు. దీంతో 14 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 99/8 గా నమోదైంది. 


కష్టాల్లో కోల్‌కతా..

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచులో బెంగళూరు బౌలర్ల జోరు కొనసాగుతోంది. వనిందు హసరంగ వేసిన ఏడో ఓవర్లో శ్రేయస్ అయ్యర్‌ (13)ని, తొమ్మిదో ఓవర్లో ఐదో బంతికి సునీల్ నరైన్‌ (12)ని, ఆఖరు బంతికి షెల్డన్‌ జాక్సన్‌ (0)ని పెవిలియన్‌కి చేర్చాడు. అంతకు ముందు  ఆకాశ్ దీప్ వేసిన 8వ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించిన సునీల్ నరైన్ (12) రెండో బంతిని సిక్స్‌గా మలిచాడు. దీంతో 9 ఓవర్లకు కోల్‌కతా ఆరు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం సామ్ బిల్లింగ్స్‌ (10), ఆండ్రూ రసెల్‌ (0) క్రీజులో ఉన్నారు.


బెంగళూరు బౌలర్ల జోరు.. కోల్‌కతా మూడు వికెట్లు డౌన్‌..

బెంగళూరు బౌలర్ల ధాటికి.. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్‌ వేసిన ఐదో ఓవర్లో ఆఖరు బంతికి మరో ఓపెనర్‌ అజింక్య రహానె (9) షాబాజ్‌ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆకాశ్ దీప్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే నితీశ్ రాణా (10) భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. దీంతో  పవర్ ప్లే పూర్తయ్యే సరికి కోల్‌కతా 44/3 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (12),  సునీల్ నరైన్‌ (0)  క్రీజులో ఉన్నారు.


కట్టుదిట్టంగా బెంగళూరు బౌలింగ్‌..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఆకాశ్ దీప్‌ వేసిన నాలుగో ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ వెంకటేశ్ అయ్యర్ (10) ఔటయ్యాడు. డేవిడ్‌ విల్లే వేసిన తొలి ఓవర్లో నాలుగు పరుగులు ఇచ్చాడు. రెండో ఓవర్లో సిరాజ్‌ ఆరు పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో తొలి బంతిని వెంకటేశ్ అయ్యర్‌ (10) బౌండరీకి తరలించాడు. మూడో ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ కోల్‌కతాను కట్టడి చేస్తున్నారు. దీంతో నాలుగు ఓవర్లకు కోల్‌కతా ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది. అజింక్య రహానె (9), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (5) క్రీజులో ఉన్నారు.


టాస్‌ నెగ్గిన బెంగళూరు.. గెలుపు బాట పట్టేనా.?

టీ20 మెగా టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతాకు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైని ఓడించిన కోల్‌కతా జోరు మీదుంది. మరోవైపు, పంజాబ్‌తో జరిగిన గత మ్యాచులో బెంగళూరు భారీ స్కోరు నమోదు చేసినా ఓటమి తప్పలేదు. ఈ మ్యాచులోనైనా గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

తుది జట్ల వివరాలు..

బెంగళూరు : డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), అనుజ్‌ రావత్‌, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్‌), రూథర్‌ఫొర్డ్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, డేవిడ్‌ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్‌, మహమ్మద్‌ సిరాజ్

కోల్‌కతా : వెంకటేశ్ అయ్యర్‌, అజింక్య రహానె, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), సామ్ బిల్లింగ్స్‌, ఆండ్రూ రసెల్, షెల్డన్‌ జాక్సన్ (వికెట్ కీపర్‌), సునీల్ నరైన్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్ యాదవ్‌,  వరుణ్‌ చక్రవర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని