T20 World Cup: ఇద్దరు ఉన్నా ఒకరికే ఛాన్స్‌..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టుతో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న జట్టును భారత మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్‌ ఎంపిక..

Published : 21 Oct 2021 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టుతో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హై వోల్టేజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న జట్టును తన అంచనాతో భారత మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్‌ ఎంపిక చేశాడు. అయితే, తన అంచనా ప్రకారం.. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరినే తుదిజట్టులోకి తీసుకునే అవకాశముందని పేర్కొన్నాడు. దాంతో పాటు ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కి తను అంచనా వేసిన జట్టులో చోటు కల్పించకపోవడం గమనార్హం.

‘ఈ ప్రపంచకప్‌లో భారత్ బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో బరిలోకి దిగుతుంది. తుది జట్టు కూర్పు ఎలా ఉంటే సత్ఫలితాలు వస్తాయో కోహ్లీకి బాగా తెలుసు. నా అంచనా ప్రకారం.. భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్ ఠాకూర్‌ ఇద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో పాటు కేఎల్ రాహుల్‌ ఇన్నింగ్స్‌ని ఆరంభించే అవకాశం ఉంది. విరాట్‌ కోహ్లీ మూడు, సూర్యకుమార్ యాదవ్‌ నాలుగు, రిషభ్‌ పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే వీలుంది. ఆల్‌-రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేయకున్నా.. ఫినిషర్‌ అవసరం ఉంది కాబట్టి ఆరో స్థానంలో ఆడించాలి. ఇక రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్‌, మహమ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌/శార్దూల్ ఠాకూర్‌లలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కితే వారు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి రావాలి ’ అని పార్థివ్‌ పటేల్ సూచించాడు. ప్రపంచకప్‌ చరిత్రలో దాయాది పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు భారత్‌ను ఓడించలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఐదు సార్లు, వన్డే ప్రపంచకప్‌లో ఏడు సార్లు ఇరు జట్లు పోటీపడగా.. అన్నిసార్లు టీమిండియానే విజేతగా నిలిచింది. అక్టోబరు 24న మరోసారి ఇరు జట్ల తలపడనున్న నేపథ్యంలో.. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని