T20 World Cup: ఘన విజయంతో.. ఆ ఇద్దరికి ఘన వీడ్కోలు

టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌ ఘన విజయంతో ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటర్లు

Updated : 09 Nov 2021 08:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌ ఘన విజయంతో ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటర్లు, బౌలింగ్‌లో ఆధిపత్యం కనబరిచిన భారత్‌ సునాయాస విజయంతో ఇంటిముఖం పట్టింది. వరుసగా మూడు విజయాలు సాధించినా సెమీస్‌ బెర్తు సాధించలేకపోయింది. గ్రూప్‌-2 నుంచి పాక్‌, కివీస్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీ20 జట్టు పగ్గాలను వదిలేస్తానని ప్రకటించిన కోహ్లీకి, హెడ్‌ కోచ్‌గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఘన వీడ్కోలు చెప్పినట్టైంది.

నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియాను భారత్‌ బౌలర్లు 132/8 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం టీమ్‌ఇండియా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో 136 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56: ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు), కేఎల్‌ రాహుల్ (54*: మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ధాటిగా ఆడేశారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు అర్ధశతక (86) భాగస్వామ్యం నిర్మించారు. అయితే రోహిత్ ఔటైనా.. పరుగుల వేగం మాత్రం తగ్గలేదు. అనంతరం సూర్యకుమార్(25: నాలుగు ఫోర్లు)తో కలిసి రాహుల్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. నమీబియా బౌలర్‌ ఫ్రైలింక్‌ ఒక వికెట్ తీశాడు.

విఫలమైన నమీబియా బ్యాటర్లు

డేవిడ్ వైజ్ (26), బార్డ్‌ (21) తప్ప మిగతా అందరూ విఫలమయ్యారు. నమీబియా బ్యాటర్లలో మైకెల్ 14, క్రెయిగ్‌ డకౌట్, ఎరాస్మస్ 12, జాన్‌ నికోల్‌ 5, స్మిత్ 9, ఫ్రైలింక్‌ 15*, రుబెన్ 13* పరుగులు చేశారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్‌ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్‌ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. 

ఇకపై దూకుడు ఇలాగే కొనసాగిస్తా.. కోహ్లీ

మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ..  ‘‘ఆరేడేళ్ల నుంచి నాపై తీవ్రమైన పనిభారం, ఒత్తిడి ఉంది. ఈ పనిభారం నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఇదే సరైన సమయంగా భావించాను. ఈ టోర్నీలో మాకు అనుకున్న ఫలితాలు రాలేవు. కానీ మా ఆటగాళ్లు బాగా ఆడారు. ఈ టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించలేకపోయాం. ఆ మ్యాచ్‌లు చాలా కఠినంగా సాగాయి. ఇన్నేళ్లపాటు నాతో పనిచేసిన కోచ్‌ రవిశాస్త్రి, అతని వ్యక్తిగత సిబ్బందికి ధన్యవాదాలు. వారు గొప్ప బాధ్యతలు నిర్వహించారు. ఆటగాళ్ల కోసం అద్భుతమైన పరిస్థితులు కల్పించారు. ఇలాంటి వాతావరణంలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఇక ముందు కూడా ఆటలో దూకుడు ప్రదర్శిస్తాను. నేను కెప్టెన్‌ కాకముందు అవతలి వ్యక్తికి ఎలాగైతే సహకరించానో, ఇప్పుడు కూడా అలాగే మద్దతిస్తాను’’ అని కోహ్లీ అన్నాడు.  

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని