
T20 World Cup: స్కాట్లాండ్‌పై సూపర్ విక్టరీ.. భారీగా పెరిగిన రన్‌రేట్
ఇంటర్నెట్ డెస్క్: ఇలాంటి విక్టరీ కావాలి. ప్రత్యర్థి ఎవరైనా సరే సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాలని కోరుకుంటాడు భారత్ క్రికెట్ జట్టు అభిమాని. తొలుత బౌలింగ్.. ఆనక బ్యాటింగ్‌లోనూ ప్రతాపం చూపించి విజయం సాధించింది టీమ్‌ఇండియా. దీంతో టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నవంబర్ 8న నమీబియాపై కూడా భారత్ భారీ విజయం సాధించాలని.. నవంబర్ 7న కివీస్‌పై అఫ్గాన్ గెలుపొందాలని కోరుకుందాం..
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్.. స్కాట్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 85 పరుగులకే కుప్పకూలగా.. భారత్ రెండు వికెట్ల నష్టానికి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్‌ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50: ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), రోహిత్ శర్మ (30: ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే విజయానికి ఇంకో పదహారు పరుగులు అవసరమైన సమయంలో రోహిత్‌ను స్కాట్లాండ్ బౌలర్ వీల్ వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (2*), సూర్యకుమార్ యాదవ్ (6*) మిగిలిన పనిని పూర్తి చేసేశారు. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ (4 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుంది. ఈ గెలుపుతో భారత్ నెట్ రన్ రేట్ (+1.619) అఫ్గానిస్థాన్ (+1.481), న్యూజిలాండ్ (+1.277) కంటే మెరుగైన స్థితికి చేరింది. ప్లేయర్ ది మ్యాచ్‌గా జడేజా ఎంపికయ్యాడు. ఎక్కువ బంతులు (81) మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా విజయం సాధించడం గమనార్హం.
చెలరేగిన భారత బౌలర్లు
కీలకమైన మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ (3/14), జడేజా (3/15) స్కాట్లాండ్‌ను దెబ్బ తీశారు. టాస్ నెగ్గిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకుని స్కాట్లాండ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ నిర్దేశించింది. జార్జ్ మున్సీ (24), లీస్క్ (21) కాస్త ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. రిచీ బెరింగ్‌టన్, షరిఫ్, ఈవన్స్ పరుగులేమీ చేయకుండా ఔట్ అయ్యారు. కెప్టెన్ కోట్జర్ (1), క్రాస్ (2), గ్రీవ్స్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. మెక్‌లాయిడ్ 16, వాట్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా 3.. బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన వారిలో చాహల్ (63)ను దాటుకొని బుమ్రా (64) నంబర్‌వన్ స్థానానికి చేరాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.