Venkatesh Iyer: వెంకటేశ్‌ను అలా తీర్చిదిద్దాలి

వెంకటేశ్‌ అయ్యర్‌ను ఆల్‌రౌండర్‌గా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘వెంకటేశ్‌ అయ్యర్‌ను ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలి. 6-7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపాలి. అంతేకాదు నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయించాలి.

Updated : 12 Nov 2021 08:38 IST

ముంబయి: వెంకటేశ్‌ అయ్యర్‌ను ఆల్‌రౌండర్‌గా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘వెంకటేశ్‌ అయ్యర్‌ను ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలి. 6-7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దింపాలి. అంతేకాదు నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయించాలి. ఇది చేయగలిగితే మనకు మంచి ప్రత్యామ్నాయం దొరికినట్లే. 3-4 ఏళ్లుగా ఆల్‌రౌండర్‌ రూపంలో మనం కేవలం ఒకే ప్రత్యామ్నాయం ఉండేది. విజయ్‌ శంకర్‌, శివమ్‌ దూబె జట్టులోకి వచ్చినా అంచనాలు అందుకోలేకపోయారు. కానీ వెంకటేశ్‌ అయ్యర్‌ విషయంలో ఇలా జరగదనే ఆశిస్తున్నా. దూబె, శంకర్‌ల కన్నా వెంకటేశ్‌కు ఎక్కువ అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. తమ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఎక్కువమంది ఉంటే.. ఏ ఆటగాడైనా జట్టులో స్థానాన్ని తేలిగ్గా తీసుకోలేరు’’ అని గావస్కర్‌ అన్నాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ రెండో దశ టోర్నీలో 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేసి వెంకటేశ్‌ అయ్యర్‌ అందరి దృష్టిలో పడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో రాణించలేకపోయిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య స్థానంలో అతడిని న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు.

అతడే పాండ్యకు ప్రత్యామ్నాయం... వీవీఎస్‌: హార్దిక్‌ పాండ్యకు ప్రత్యామ్నాయ పాత్రను పోషించగల సత్తా కొత్త కుర్రాడు వెంకటేశ్‌ అయ్యర్‌కు ఉందని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ‘‘న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అయిదుగురు ఓపెనర్లు ఉన్నారు. రోహిత్‌శర్మ, కేఎల్‌ రాహుల్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ కూడా ఓపెనింగ్‌కు ప్రధాన పోటీదారు. అందుకే వెంకటేశ్‌ అయ్యర్‌కు ఓపెనర్‌గా చోటు లేదు. అతడు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావాలి. అయిదారు స్థానాల్లో బ్యాటింగ్‌ దింపాలి. ఒకటి రెండు ఓవర్లు బౌలింగ్‌ చేయించాలి. అతడు హార్దిక్‌ పాండ్యకు ప్రత్యామ్నాయంగా పనికొస్తాడు. ఉపయుక్తమైన ఆల్‌రౌండర్‌గా అతడిని తీర్చిదిద్దొచ్చు’’ అని లక్ష్మణ్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో సత్తా చాటినందుకు యువ ఆటగాళ్లకు తగిన ప్రతిఫలం దక్కిందని అతడన్నాడు. ‘‘ఐపీఎల్‌లో సత్తా చాటినందుకు యువ ఆటగాళ్లకు తగిన ప్రతిఫలం దక్కింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో యువ ఆటగాళ్లను పరీక్షించడం కీలకం. బ్యాట్స్‌మెన్లను మాత్రమే కాక మెరుపు వేగం ఉన్న అవేశ్‌ఖాన్‌, డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ హర్షల్‌ పటేల్‌ లాంటి పేసర్లను ఎంపిక చేయడంతో జట్టు బలోపేతమైంది’’ అని వీవీఎస్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కోహ్లి, బుమ్రా లాంటి స్టార్లకు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు.. హర్షల్‌, వెంకటేశ్‌, అవేష్‌, రుతురాజ్‌లకు అవకాశమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని