Team India: ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లే 

ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు వార్మప్‌ మ్యాచ్‌లు లేవని, కేవలం ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లే ఉంటాయని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది...

Published : 26 Jun 2021 01:23 IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు వార్మప్‌ మ్యాచ్‌లు లేవని, కేవలం ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లే ఉంటాయని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఆ టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లీసేన ప్రాక్టీస్‌ కోసం కౌంటీ జట్లతో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరడంతో ఈసీబీ ఇలా స్పందించింది. కొవిడ్‌-19 నిబంధనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దుర్హమ్‌లోని రివర్‌సైడ్‌ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌లు ఉంటాయని వివరించింది. అయితే, దీనికి సంబంధించిన తేదీల వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇంగ్లాండ్‌లోని కౌంటీ జట్ల ఆటగాళ్లకు నిరంతరం కరోనా పరీక్షలు చేస్తున్నా బయోబుడగలో ఉండరని, దాంతో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని సమాచారం. అందుకే వారితో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు నిర్వహించడం లేదని, ఇంట్రా-స్వ్కాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లే నిర్వహిస్తారని ఒక బీసీసీఐ ప్రతినిధి పీటీఐతో అన్నారు. కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లకు ఇప్పుడు 20 రోజుల పాటు విశ్రాంతి ఇచ్చారు. దాంతో వారంతా కుటుంబాలతో సహా బయటకు వెళ్లడానికి అనుమతులు లభించాయి. జులై 14న తిరిగి లండన్‌లో ఏకమై మళ్లీ క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. ఆ తర్వాతే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు రెండు బృందాలుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

మరోవైపు కివీస్‌తో తుదిపోరుకు ముందు కూడా టీమ్‌ఇండియా ఇలాగే ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లు ఆడింది. అయితే ఆ ప్రాక్టీస్‌ సరిపోదని, అది టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు సరైన సన్నద్ధం కాదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ముందుచూపుతో వ్యవహరించిందని అన్నారు. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఏర్పాటు చేసుకొందని, అందువల్లే కివీస్‌ తుదిపోరులో ఆధిపత్యం చెలాయించిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోహ్లీ కూడా ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్‌కు ముందు కౌంటీ జట్లతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరాడు. ఈ విషయంపై బీసీసీఐ సైతం ఈసీబీని సంప్రదించింది. కానీ, కరోనా నిబంధనల కారణంగా అది వీలుకావడం లేదని ఆ బోర్డు ప్రతినిధి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని