Dinesh Karthik: ధోనీ తుపాను సృష్టించాడు.. ఇక నాకు తలుపులు మూసుకుపోయాయి!

మహేంద్రసింగ్‌ ధోనీ తన రాకతో భారతదేశాన్ని ఊపు ఊపేశాడని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అతడి రాకతో తనకిక తలుపులు మూసుకుపోయాననే భావించానని తెలిపాడు. ..

Updated : 10 Aug 2021 10:27 IST

ముంబయి: మహేంద్రసింగ్‌ ధోనీ తన రాకతో భారతదేశాన్ని ఊపు ఊపేశాడని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అతడి రాకతో తనకిక తలుపులు మూసుకుపోయాననే భావించానని తెలిపాడు. వికెట్‌ కీపర్‌గా అవకాశం లేకపోవడంతో స్పెషలిస్టు బ్యాటర్‌గా ప్రయత్నించాలని ధోనీ, రాహుల్‌ ద్రవిడ్‌ తనను ప్రోత్సహించారని వెల్లడించాడు.

ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌ ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసుకు వ్యాఖ్యానం చేస్తున్నాడు. చాలాకాలం జట్టుకు దూరమైన డీకే 2019 ప్రపంచకప్‌ ముందు టీమ్‌ఇండియాలో పునరాగమనం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టాడు. ప్రపంచకప్‌ ఆడాడు. యువకులకు పెద్దపీట వేసే క్రమంలో ఆ తర్వాత డీకేను జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది.

‘నేనెప్పుడూ కుంగిపోలేదు. తర్వాత ఏం చేయాలన్న దానిపైనే నా దృష్టి ఉంటుంది. నేనెప్పుడూ అదే ప్రశ్న వేసుకొనేవాడిని. ఒకానొక సమయంలో నేను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ అవతారం ఎత్తాల్సి వచ్చింది. అప్పుడు మిడిలార్డర్‌ లేదా ఓపెనర్‌గానే అవకాశం ఉంది. నేను ప్రతిభావంతుడినని, మంచి బ్యాట్స్‌మన్‌ అని ధోనీ సహా అంతా ప్రోత్సహించారు’ అని డీకే తెలిపాడు.

‘వారి మాటలు నాకు ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. స్పెషలిస్టు బ్యాటర్‌గా రాణించే నైపుణ్యాలు నాకున్నాయని రాహుల్‌ ద్రవిడ్‌ సైతం అన్నారు. దాంతో నేను దేశవాళీ క్రికెట్‌కు వెళ్లి భారీ పరుగులు చేశాను. ఆ తర్వాత ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకొని రాణించాను’ అని డీకే పేర్కొన్నాడు.

‘ధోనీ తన రాకతో దేశమంతా తుపాను సృష్టించాడు. దాంతో నాకిక తలుపులు మూసుకు పోయాయని భావించాను.  ఎందుకంటే భారత్‌లో వికెట్‌కీపింగ్‌ అంటే దశాబ్ద కాలం చేయాల్సిన పని. గతంలో సయ్యద్‌ కీర్మాణి, కిరణ్‌ మోరె అలాగే చేశారు. ధోనీ సైతం తరానికి ఒక్కడు’ అని డీకే వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని