IPL 2021: 140 సాధిస్తే గొప్ప అనుకున్నా.. కానీ..: ధోనీ

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ ప్రారంభమైంది. ఆసక్తిగా సాగిన ముంబయి, చెన్నై పోరులో ధోనీసేన 20 పరుగులతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది...

Updated : 20 Sep 2021 08:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ ప్రారంభమైంది. ఆసక్తిగా సాగిన ముంబయి, చెన్నై పోరులో ధోనీసేన 20 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది. అయితే, తొలుత ఈ మ్యాచ్‌లో చెన్నై తడబడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌ కొనసాగించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (88; 58 బంతుల్లో 9x4, 4x6), రవీంద్ర జడేజా (26; 33 బంతుల్లో 1x4) ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. చివర్లో బ్రావో (23; 8 బంతుల్లో 3x6) బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో చెన్నై 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 156/6తో నిలిచింది.

ఇక మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మాట్లాడుతూ తాము ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో గౌరవప్రదమైన స్కోర్‌ సాధిస్తే బాగుంటుందని అనుకున్నట్లు చెప్పాడు. అయితే, రుతురాజ్‌, బ్రావో అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఆడారన్నాడు. 140 పరుగులు చేయడమే అత్యద్భుతమని భావిస్తే 156 పరుగులు సాధించామన్నాడు. ఈ పిచ్‌ నెమ్మదిగా ఉందని, దాంతో తాము వికెట్లు కోల్పోయామని తెలిపాడు. అలాగే తాను బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎనిమిది లేదా తొమ్మిదో ఓవర్‌ నుంచి దూకుడుగా ఆడాలనుకున్నట్లు చెప్పాడు. మరోవైపు రుతురాజ్‌ చివరి వరకూ నిలిచాడని ధోనీ వివరించాడు.

ఫాస్ట్‌ బౌలర్లు ఎలా ఆడుతున్నారో పరిశీలించాలని, వాళ్లు పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలని చెప్పాడు. ఫాస్ట్‌ బౌలర్లు ఎవరైనా చాలా కాలం ప్రాక్టీస్‌ లేకపోతే కెప్టెన్లకు ఇబ్బంది అవుతుందన్నాడు. ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు గాయపడిన విషయంపై స్పందిస్తూ అతడు బాగున్నాడని, చేతికి పెద్ద గాయం కాలేదని ధోనీ తెలిపాడు. తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉందని, అప్పటికి రాయుడు కోలుకుంటాడని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని