
IPL 2021: ఈ బాధ వర్ణనాతీతం: పంత్.. ఫైనల్లో ఏమైనా జరగొచ్చు: మోర్గాన్
ఇంటర్నెట్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంపై దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ విచారం వ్యక్తం చేశాడు. ఇప్పుడేం మాట్లాడాలో అర్థం కావట్లేదని బాధపడ్డాడు. బుధవారం రాత్రి చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారైనా కప్పు గెలవాలని ఆశించిన దిల్లీకి మరోసారి ఎదురుగాలి వీచింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మరింత మంచి ప్రదర్శన చెస్తామని చెప్పాడు.
‘ఇప్పుడెంత బాధ ఉందనేది చెప్పలేను. మాటలు రావడం లేదు. ఎలాగైనా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. చివరివరకూ పోరాడాలనుకున్నాం. అందుకు తగ్గట్టే ఆఖర్లో మా బౌలర్లు పట్టుదలగా రాణించారు. దాదాపు మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశారు. కానీ, దురదృష్టంకొద్దీ గెలుపొందలేకపోయాం. మరోవైపు మేం బ్యాటింగ్ చేసేటప్పుడు కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో బాగా కట్టడిచేశారు. దాంతో మేం స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. అవసరమైన పరుగులు సాధించలేకపోయాం. అదే మాకు పెద్ద లోటుగా మారింది. అయితే, ఈ సీజన్లో మేం చాలా బాగా ఆడాం. ఆటలో ఎత్తుపల్లాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ సహజమే. అయినా, మేం సానుకూల దృక్పథంతో ఉంటాం. అలాగే ముందుకు సాగుతాం’ అని పంత్ వివరించాడు.
మా తప్పులను సరిదిద్దుకుంటాం: మోర్గాన్
‘ఈ మ్యాచ్‌లో చివరి నాలుగు ఓవర్లలో ఏం జరిగిందనేదానిపై మేం సమీక్ష చేసుకుంటాం. మాకు ఓపెనర్లు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌పై పట్టు సాధించారు. కానీ, చివర్లో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడ్డాం. అయినా, మ్యాచ్ గెలిచి ఫైనల్స్‌కు చేరినందుకు సంతోషంగా ఉంది. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన వేళ మ్యాచ్ దిల్లీకే అనుకూలంగా ఉంది. కానీ, త్రిపాఠి మమ్మల్ని కాపాడాడు. అతడెన్నో మాకు విజయాలు అందించాడు. యువ క్రికెటర్లు స్వేచ్ఛగా వచ్చి ఇలా ఆడటం బాగుంది. అందుకోసం మా సహాయక సిబ్బంది చాలా కష్టపడ్డారు. వారివల్లే ఇది సాధ్యమైంది. అలాగే మా జట్టుపై భారీ అంచనాలున్నాయి. కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ వెంకటేశ్ అయ్యర్‌ను గుర్తించి ప్రోత్సహించడంతో బాగా రాణిస్తున్నాడు. ఎలాంటి వికెట్ మీదైనా పరుగులు చేస్తున్నాడు. ఇక చెన్నైతో తుదిపోరులో ఏమైనా జరగొచ్చు’ అని కోల్‌కతా కెప్టెన్ స్పందించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.