Stuart Binny: 4 పరుగులు 6 వికెట్లు.. మరెవరికీ లేని రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌కు బిన్నీ వీడ్కోలు

టీమ్‌ఇండియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల ఈ క్రికెటర్‌ 6 టెస్టులు, 14 వన్డేలు, 2 టీ20లు ఆడాడు....

Published : 30 Aug 2021 13:29 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల ఈ క్రికెటర్‌ 6 టెస్టులు, 14 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు అతడి పేరుతోనే ఉండటం గమనార్హం.

‘ఫస్ట్‌క్లాస్‌, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. అత్యున్నత స్థాయిలో టీమ్‌ఇండియాకు ఆడటం నాకెంతో గర్వకారణం. అందుకు నేనెంతో సంతోషిస్తున్నా. నా కెరీర్‌ ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని స్టువర్ట్‌ బిన్నీ తెలిపాడు.

ప్రత్యేక కారణాలతో బిన్నీకి అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ అవకాశాలు రాలేదు. అతడు ఎక్కువ పరుగులేమీ చేయలేదు. అయితే, 2014లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అతడు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కేవలం 4 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకు సైతం ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం. 1993లో వెస్టిండీస్‌పై కుంబ్లే 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. దానిని బిన్నీ బద్దలు కొట్టాడు.

బిన్నీకి దాదాపుగా 95 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. అందుకే మహేంద్రసింగ్‌ ధోనీ అతడిని టెస్టు క్రికెట్లో ఉపయోగించుకొని కొంత విజయవంతం అయ్యాడు. 2014, జులైలో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో బిన్నీ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేశాడు. అతనాడిన ఆరు టెస్టుల్లో సాధించిన ఏకైక అర్ధశతకం ఇదే.

ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచులో బిన్నీ ఓ ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో అతడికి దారులు మూసుకుపోయాయి. ఎవిన్‌ లూయిస్‌ ఆ ఓవర్లో  ఏకంగా ఐదు సిక్సర్లు బాదడంతో బిన్నీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత క్రికెట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా అతడి తండ్రి రోజర్‌ బిన్నీ సెలక్షన్‌ కమిటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం హార్దిక్‌ పాండ్య వంటి విధ్వంసకర ఆల్‌రౌండర్‌ దొరకడంతో స్టువర్ట్‌ బిన్నీకి అవకాశాలు రావడం కష్టమైంది. కాగా, ఒకప్పుడు కర్ణాటకకు ఆడిన అతడు కొన్నాళ్ల క్రితం ఈశాన్య భారతం నుంచి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని