Updated : 29 Oct 2021 09:53 IST

T20 World Cup: నన్ను తొలగించడానికి వాళ్లెవరు? : అక్తర్

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పీటీవీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఆ ఛానల్లో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అతడిని.. అక్కడి వ్యాఖ్యాత డాక్టర్‌ నౌమన్‌ నియాజ్‌ వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. ఊహించని అవమానానికి గురైన అక్తర్‌ వెంటనే అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లాడు. ఇదంతా లైవ్‌లో ప్రసారమవ్వడం గమనార్హం. అయితే, ఈ విషయంపై సదరు టీవీ ఛానల్‌ గురువారం రాత్రి ఓ ప్రకటన జారీ చేసింది. దానికి సైతం అక్తర్‌ దీటుగా బదులిచ్చాడు.

అక్తర్‌, నౌమన్‌ మధ్య జరిగిన వివాదం మీద విచారణకు ఆదేశించామని, అది పూర్తయ్యేవరకూ ఇద్దరినీ తమ టీవీ ఛానల్‌ కార్యక్రమాల్లో అనుమతించబోమని పీటీవీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇది చూసిన పాక్‌ మాజీ పేసర్‌.. ‘మీ నిర్ణయం చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను 22 కోట్ల మంది పాకిస్థానీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల మంది ముందే ఆ ఛానల్‌కు రిజైన్‌ చేశాను. పీటీవీకి పిచ్చెక్కిందా ఏమైనా? టీవీ కార్యక్రమాల్లో వాళ్లెవరు నన్ను తొలగించడానికి?’ అంటూ తనదైనశైలిలో స్పందించాడు.

అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 26న పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో పాక్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ అనంతరం పీటీవీ లైవ్‌ డిబేట్‌ నిర్వహించగా షోయబ్‌ అక్తర్‌ హాజరయ్యాడు. అతడితో పాటు సర్​ వివియన్​ రిచర్డ్స్​, డేవిడ్ ​గోవర్​, రషీద్​ లతీఫ్​, ఉమర్ గుల్​, ఆకిబ్ జావేద్​లాంటి మాజీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే అక్తర్‌.. పాక్ బౌలర్లు హరీస్‌ రవూఫ్‌, షహీన్‌ ఆఫ్రిదిపై ప్రశంసలు కురిపించగా నౌమన్ మధ్యలో కలుగజేసుకొని.. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు.

అయితే, అక్తర్‌ ఆ మాటలను పట్టించుకోకుండా తన అభిప్రాయాలు కొనసాగించడంతో ఆ వ్యాఖ్యాతకు కోపమొచ్చింది. దీంతో షోయబ్‌ తనపట్ల అమర్యాదగా వ్యవహరించాడని, దీన్ని సహించబోనని.. తన షో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదంతా ప్రత్యక్షప్రసారం అవుతుండగానే జరిగింది. చివరికి అక్తర్ తన మైక్రోఫోన్ తొలగించి బయటకు వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక ఆ కార్యక్రమం అలాగే కొనసాగడం కొసమెరుపు. తర్వాత ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని