Updated : 09/08/2021 13:35 IST

Lovlina Borgohain: నేను మారను.. పతకం రంగు మారుస్తాను: లవ్లీనా శపథం

దిల్లీ: ఒలింపిక్‌ కాంస్యంతో తానేమీ మారిపోనని భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెన్‌ అంటోంది. పతకం రంగు మారుస్తానని ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. బాక్సింగ్‌ కోసం ఎన్నో త్యాగాలు చేశానని వెల్లడించింది. ఆమె పీటీఐతో ప్రత్యేకంగా మాట్లాడింది.

టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజేందర్‌సింగ్‌, మేరీకోమ్‌ తర్వాత పతకం గెలిచిన మూడో బాక్సర్‌గా ఆమె అవతరించింది.

‘ఎనిమిదేళ్లుగా ఇంటికి దూరంగా ఉండటమే నేను చేసిన మొదటి త్యాగం. నా కుటుంబ కష్టాలను పంచుకోలేదు. దూరంగా చూస్తూనే ఉండిపోయాను. ఇంతకన్నా పెద్ద త్యాగం మరోటి ఉండదు. యువతిగా నాకుండే కోరికలను త్యజించాను. నా వయసులో వారిలా చిరుతిళ్లు తినలేకపోయాను. ఏకాగ్రత కోల్పోవద్దని సాధన నుంచి విరామమే తీసుకోలేదు. ఎనిమిదేళ్లు నిరంతరాయంగా ఇది కొనసాగింది’ అని లవ్లీనా తెలిపింది. టోక్యో నుంచి వచ్చిన లవ్లీనా కొన్ని రోజులు సెలవులు తీసుకోనుంది. కుటుంబంతో సమయం ఆస్వాదించనుంది. ప్రస్తుత ఒలింపిక్స్‌ అయిపోయాయని ఇక ప్యారిస్‌కు సిద్ధం కావాల్సి ఉందని ఆమె అంటోంది.

‘నేనిప్పుడు తాజాగా ఆరంభించాలి. నా ఆటలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడున్న బలం, దృఢత్వం ఉపయోగపడలేదని కాదు. ఉండాల్సిన స్థాయిలో లేవు. నిజానికి నాలుగేళ్లు పట్టే స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌పై నేను నాలుగు నెలలే పనిచేశాను. ఇది నాకు పనిచేసినా ఒలింపిక్స్‌కు అంతకన్నా ఎక్కువ శ్రమ అవసరం’ అని లవ్లీనా పేర్కొంది. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మాజీ విజేత నీన్‌ చిన్‌ చెన్‌ను ఓడించిన ఆమె భయాన్నీ జయించింది.

‘కొన్నేళ్లుగా నాలో కొన్ని భయాలు, భావోద్వేగాలు ఉండిపోయాయి. ఈ ఒలింపిక్స్‌లో నేను ఆడిన ప్రతిసారీ దేశ ప్రజల నుంచి వచ్చిన మద్దతతో వాటిని అధిగమించాను. నాలుగుసార్లు నన్ను ఓడించిన బాక్సర్‌ను ఓడించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. హైజంప్‌లో ఖతార్‌, ఇటలీ పసిడి పతకాన్ని పంచుకోవడం ప్రేరణనిచ్చింది. క్రీడల్లో మానవత్వం బతికే ఉందనిపించింది. ఎంత శత్రుత్వం ఉన్నా క్రీడలు ఒక్కటి చేస్తాయని ఆ సంఘటన తెలియజేసింది’ అని తెలిపింది. ఒలింపిక్స్‌కు ముందు బొర్గొహెన్‌ శస్త్రచికిత్స, కొవిడ్‌రూపంలో అడ్డంకులు ఎదుర్కొంది.

‘కష్టాలు నాకు కొత్తేం కాదు. ఎనిమిదేళ్లుగా పడుతూనే ఉన్నా. ఇక ముందూ ఉంటాయని తెలుసు. అందుకే నేనెప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అవాంతరాలను ఎదుర్కొంటానన్న ధీమా నాకుంటుంది. మనపై మనకు విశ్వాసం ఉంటే మానసిక వైద్యుడి అవసరం ఉండదని నా అభిప్రాయం. దేశంలో చాలామంది ఆదర్శనీయులు ఉన్నారు. అంచనాల భారాన్ని వారెలా మోస్తున్నారో తెలుసుకుంటాను. మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాను. కాంస్యంతో వచ్చిన పేరుతో నేనేమీ మారిపోను. నా పతకం రంగు మారుస్తాను. నేనెప్పటికీ బాక్సింగ్‌ విద్యార్థిగానే ఉంటాను’ అని లవ్లీనా తెలిపింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్