VVS Laxman: కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను..: లక్ష్మణ్‌

టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. సోమవారం ఆయన జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు...

Updated : 14 Dec 2021 10:15 IST

(వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. సోమవారం ఆయన జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ఇదివరకు ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇప్పుడు టీమ్‌ఇండియా కోచ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ తర్వాత రవిశాస్త్రి హెడ్‌కోచ్‌ పదవీకాలం ముగిసిపోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ప్రత్యేక చొరవ తీసుకొని ద్రవిడ్‌ను నూతన కోచ్‌గా ఎంపికచేశాడు. ఈ క్రమంలోనే ఎన్‌సీఏ బాధ్యతల్ని లక్ష్మణ్‌కు అప్పగించారు. దీంతో సోమవారం బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్‌ ఆ బాధ్యతల్ని స్వీకరించాడు. ఆసక్తికరమైన కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. అలాగే టీమ్‌ఇండియా భవిష్యత్‌ కోసం పాటుపడతానన్నాడు.

మరోవైపు ఎన్‌సీఏ చీఫ్‌గా మారిన లక్ష్మణ్‌ ముందు ఇకపై పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు ఆ బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ చాలా మంది యువ ఆటగాళ్లను మేటి క్రికెటర్లుగా తీర్చిదిద్దాడు. దీంతో చాలా మంది యువకులు ఇప్పుడు జాతీయ జట్టులో అవకాశాలు దక్కించుకొని మ్యాచ్‌ విన్నర్లుగా నిరూపించుకుంటున్నారు. అంతకుముందు ద్రవిడ్‌ అండర్‌-19, ఇండియా-ఏ జట్లకు కూడా కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2019 నుంచి 2021 వరకు ఎన్‌సీఏలో కీలక పాత్ర పోషించి.. అక్కడికి వచ్చే ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇక్కడ కూడా మంచి శిక్షణ అందించి భవిష్యత్‌ తారలను తీర్చిదిద్దాడు. మరోవైపు లక్ష్మణ్‌ తొలుత ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఒప్పుకోకపోయినా గంగూలీ చొరవతో అంగీకరించాడని తెలిసింది. దీంతో లక్ష్మణ్‌ కుటుంబం సైతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలిపోనుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని