Djokovic : టీకా వ్యతిరేకిని కాదు.. అవసరమైతే గ్రాండ్‌స్లామ్‌లనూ వదిలేస్తా: జకో

 కొవిడ్ వ్యాక్సినేషన్‌ వ్యవహారంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను ఆడలేకపోయిన..

Published : 16 Feb 2022 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ వ్యాక్సినేషన్‌ వ్యవహారంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను ఆడలేకపోయిన టెన్నిస్‌ నంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ చాలా రోజుల తర్వాత నోరు విప్పాడు. కరోనా టీకా వేయించుకోవడం కంటే గ్రాండ్‌స్లామ్‌లను వదులుకోవడానికి సిద్ధమేనని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడుతూ.. వ్యాకినేషన్‌ వ్యతిరేకిని మాత్రం కాదన్నారు. అదే క్రమంలో టీకా తీసుకోవాలా.. వద్దా అనే నిర్ణయం తీసుకునే హక్కు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశాడు. 

వచ్చే ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డెన్‌ కోసం బరిలోకి దిగేటప్పుడు టీకా కీలకమైతే టైటిల్స్‌ను వదులుకోవడానికీ సిద్ధమేనని జకోవిచ్‌ వెల్లడించాడు. ‘‘నా శరీరం మీద పడే ప్రభావం కంటే నాకు టైటిల్‌తో సహా ఏదీ ముఖ్యం కాదు. నేను వీలైనంత వరకు నా శరీరానికి తగ్గట్టు ఉండటానికి ప్రయత్నిస్తా. టీకాలు వేయించుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడలేదు. నా మెడికల్ రికార్డులు, వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను వెల్లడించలేదు. దానిని ప్రైవేట్‌గా ఉంచుకునే హక్కు నాకుందని భావిస్తున్నా’’ అని జకోవిచ్‌ పేర్కొన్నాడు. కరోనాను రూపుమాపడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలుసనన్నారు. అందుకే తాను కొవిడ్ వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకం కాదని తెలిపాడు. త్వరలో మహమ్మారికి ముగింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని