IPL 2023: ఈ ఐపీఎల్‌కు దూరమైన కీలక ఆటగాళ్లు వీరే..

శుక్రవారం నుంచి ఐపీఎల్‌ (IPL 2023) సందడి ప్రారంభం కానుంది. ఆయా జట్లు ఇప్పటికే సిద్ధమైపోయాయి. అయితే కొంతమంది కీలక ఆటగాళ్లు మాత్రం దూరం కావడం అభిమానులను నిరాశకు గురి చేసే అంశం..వాళ్లెవరో చూద్దామా?

Updated : 30 Mar 2023 12:29 IST

క్రికెట్‌ ప్రేమికులకు ఈ నెలాఖరు నుంచి పండగే. దాదాపు రెండు నెలలపాటు సాగే ఐపీఎల్‌ (IPL 2023) కోసం ఆటగాళ్లు సిద్ధమయ్యారు. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలబారిన పడి ఈ మెగాటోర్నీకి దూరమవుతున్నారు. వాళ్లెవరు, ఎందుకు దూరమవుతున్నారో చూద్దాం!

  1. రిషభ్‌ పంత్‌: గత సీజన్‌లో దిల్లీ  కెప్టెన్ అయిన పంత్‌..  ఇటీవల రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న విషయం తెలిసిందే. దిల్లీ విజయాల్లో కీలకంగా ఉన్న పంత్‌ మిస్సవడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతడి స్థానంలో డెవిడ్‌ వార్నర్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. జట్టులో ఉత్సాహాన్ని నింపేందుకు పంత్‌ను కొన్ని మ్యాచ్‌లకైనా డగౌట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హెడ్‌కోచ్‌ పాంటింగ్‌ తెలిపాడు.
  2. బుమ్రా : వెన్నునొప్పి కారణంగా టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా.. గత ఆరు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్‌కూ ఆడటం లేదు. అతడి స్థానంలో ముంబయి జట్టు జోఫ్రా ఆర్చర్‌ సేవలను వినియోగించుకోనుంది.
  3. శ్రేయస్‌ అయ్యర్‌ : వెన్ను గాయం కారణంగా కోల్‌కతా జట్టుకు దూరమైన శ్రేయస్‌ స్థానంలో.. నితీష్‌ రాణాను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించుకుంది. గత రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న శ్రేయస్‌.. వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రిస్క్‌ తీసుకోవడం లేదు.
  4. జానీ బెయిర్‌స్టో : ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటరైన బెయిర్‌స్టో కాలికి సర్జరీ కారణంగా ఈ ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు. దీంతో పంజాబ్‌ జట్టు అతడి స్థానంలో మాథ్యూ షార్ట్‌ను తీసుకుంది.
  5. ప్రసిధ్‌ కృష్ణ : వెన్ను నొప్పితో రాజస్థాన్‌ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ ఆ జట్టుకు దూరమవుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. అతడి స్థానంలో సందీప్‌ శర్మను జట్టు ఎంపిక చేసుకుంది.
  6. రజత్‌ పటిదార్‌ : గతేడాది అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రజత్‌.. మడమ గాయం కారణంగా ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ మిడిల్‌ ఆర్డర్‌ ఆర్సీబీ బ్యాటర్‌.. బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ప్రస్తుతం ఉన్నాడు.
  7. ముఖేశ్‌ చౌదరి : చెన్నై యువ పేసర్‌ ముఖేశ్‌ చౌదరి.. ఈ సీజన్‌కు మిస్సయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్‌ వెల్లడించాడు.
  8. జోష్‌ హేజిల్‌వుడ్‌ : గాయం కారణంగా ఇటీవల బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీకి దూరమైన జోష్‌ హేజిల్‌వుడ్‌.. ఈ ఐపీఎల్‌ సీజన్‌ తొలి అర్ధభాగానికి దూరమవుతున్నాడు. ఆర్సీబీ పేస్‌ దళంలో కీలక బౌలర్‌ అయిన హేజిల్‌వుడ్‌.. గత ఏడాది 20 వికెట్లు పడగొట్టాడు.
  9. కైల్‌ జేమీసన్‌ : న్యూజిలాండ్‌ పేసర్‌ అయిన జేమీసన్‌.. వెన్ను గాయం కారణంగా గత 9 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో చెన్నై జట్టు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్‌ సిసిందాతో ఒప్పందం చేసుకుంది.
  10. గ్లెన్‌ మాక్స్‌వెల్‌: మోకాలి గాయం కారణంగా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. భారత్‌తో వన్డే సిరీస్‌లోనూ జట్టుతోపాటు ఉన్నప్పటికీ రెండు వన్డేలు ఆడలేదు. ఈ క్రమంలో ఆసీస్‌ కోచ్‌ కూడా వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో రిస్క్‌ తీసుకోదల్చుకోలేదని తెలిపాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని