Tokyo Olympics: 50% లేదా 10వేల మందికి అనుమతి

స్థానిక అభిమానులను అనుమతించడంపై టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీటింగ్‌ సామర్థ్యంలో సగం మంది లేదా గరిష్ఠంగా 10వేల మందిని అనుమతిస్తామని తెలిపారు. నిర్వాహకులు, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ, జపాన్‌ ప్రభుత్వం,...

Published : 22 Jun 2021 01:45 IST

చర్చోపచర్చల తర్వాత నిర్వాహకులు నిర్ణయం

టోక్యో: స్థానిక అభిమానులను అనుమతించడంపై టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీటింగ్‌ సామర్థ్యంలో సగం మంది లేదా గరిష్ఠంగా 10వేల మందిని అనుమతిస్తామని తెలిపారు. నిర్వాహకులు, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ, అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ, జపాన్‌ ప్రభుత్వం, టోక్యో మెట్రోపాలిటన్‌ ప్రభుత్వం ఆన్‌లైన్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అభిమానులు లేకుండా మెగా క్రీడలు నిర్వహించడమే సురక్షిత విధానమన్న ఆ దేశ అత్యున్నత వైద్య సలహాదారు డాక్టర్‌ షిగెరు ఒమి అంతకు ముందు నివేదిక అందించారు. అందుకు విరుద్ధంగానే నిర్ణయం రావడం గమనార్హం. జులై 23న క్రీడలు ఆరంభమవుతాయి. విదేశీ  అభిమానులపై గతంలోనే నిషేధం విధించారు.

ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు వచ్చే స్థానిక అభిమానులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని నిర్వహకులు స్పష్టం చేశారు. సంబరాలు చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఆటలు ముగిశాక క్రీడాగ్రామం నుంచి నేరుగా తమ ఇళ్లకే వెళ్లాలని చెప్పారు. ఇప్పటికే అభిమానుల వద్ద 3.6 నుంచి 3.7 మిలియన్ల టికెట్లు ఉన్నాయని వెల్లడించారు. అభిమానులు భారీ సంఖ్యలో రావడం వల్ల వేదికల వద్దే కాకుండా, రైళ్లు, బస్సులు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్‌-19 విస్తరించే ముప్పు అధికంగా ఉంటుంది.

ప్రస్తుతం టోక్యో సహా కొన్ని పట్టణ ప్రాంతాల్లో జులై 11 వరకు పాక్షిక అత్యయిక స్థితి అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పూర్తి స్థాయి అత్యయిక స్థితిని ఎత్తేస్తారు. దాంతో రెస్టారెంట్లలో పరిమిత వేళల్లో మద్యం సరఫరా చేయొచ్చు.

అభిమానులను అనుమతించేందుకే జపాన్‌ ప్రధాని సుగా యోషిహిదే సుముఖంగా ఉన్నారు. పరిస్థితులు తీవ్రంగా మారిస్తే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. డాక్టర్‌ షిగెరు ఒమి ఇచ్చిన సూచనలు తాము  పరిశీలించామన్నారు. ఆ నివేదికను తేలిగ్గా తీసుకోలేదని వెల్లడించారు.

‘అవసరమైతే అత్యయిక స్థితి విధిస్తాం. మెగా క్రీడలు సురక్షితంగా నిర్వహించేందుకు అభిమానుల ప్రవేశాలను నిషేధిస్తాం. ప్రజలు, క్రీడాకారుల సంక్షేమమే ముఖ్యం. పరిస్థితులు నియంత్రణలోనే ఉంటే అభిమానులను అనుమతించేందుకు నేను వ్యతిరేకం కాదు’ అని సుగా అన్నారు. టోక్యో గవర్నర్‌ యురికో కియోకె సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొన్నాళ్ల క్రితం వరకు ఒలింపిక్స్‌ను వాయిదా/రద్దు చేయాలన్న ప్రజలు మనసు మార్చుకుంటున్నారు. అభిమానులు లేకుండా నిర్వహిస్తే ఫర్వాలేదని అంటున్నారు. ప్రస్తుతం టోక్యోలో రోజుకు సగటున 400 కరోనా కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం తక్కువ కేసులే వస్తున్నా ఒలింపిక్స్‌ వల్ల పెరుగుతాయని, కొత్త వేరియెంట్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. జపాన్‌లో మొత్తంగా 6.5% మందికే టీకాలు పూర్తయ్యాయి. 16.5% మంది ఒక డోస్‌ వేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని