IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. నాకు అలా ఆడటం చాలా ఇష్టం: విరాట్ కోహ్లీ

టీమ్‌ఇండియా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆటగాడు. మంచి ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగాడు. ఆదివారం భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలను విరాట్ ఓ క్రీడా ఛానెల్‌తో పంచుకొన్నాడు.

Published : 23 Oct 2022 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించడంలో కీలక పాత్రధారి రోహిత్ శర్మ.. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానంలో వచ్చే విరాట్ కోహ్లీ ముఖ్య భూమిక పోషిస్తారు. రోహిత్ శర్మకి తనకు ఆటకు సంబంధించిన విషయాల్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయని విరాట్ కోహ్లీ చెప్పడం గమనార్హం. ఓ క్రీడా ఛానెల్‌తో విరాట్ మాట్లాడుతూ.. లోపాలను అధిగమించి జట్టును విజయపథంలో నడిపించేందుకు ఇద్దరం ప్రయత్నిస్తామని వెల్లడించాడు. అలాగే పాకిస్థాన్‌తో మ్యాచ్‌పైనా ప్రత్యేకంగా మాట్లాడాడు.

‘‘పెద్ద టోర్నమెంట్లలో ఎలా విజయం సాధించాలనే అంశంపై చర్చించుకుంటూ ఉంటాం. మా ప్రణాళిక, సన్నద్ధత అటువైపు ఉండేలా చూసుకుంటాం. కొన్నిరోజులపాటు ఆటకు దూరమై వచ్చినప్పటికీ జట్టులో అలాంటి వాతావరణం మాత్రం మారిపోలేదు. గ్రూప్‌లోని మిగతా ఆటగాళ్ల సహచర్యం అద్భుతం. ఇలా ఉంటే టీమ్‌ కోసం ఏం చేయడానికైనా ప్లేయర్లు ముందడుగు వేస్తారు. ఆటను అర్థం చేసుకోవడంలో మా ఇద్దరి అభిప్రాయాలు, విజన్ ఒకటే. ప్రధాన లక్ష్యం సాధించే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, ఇబ్బందులను దాటుకొని ముందుకు వెళ్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు. కీలక సమయంలో ఒత్తిడిని ఎలా తట్టుకోగలరనేది ప్రధానం. భారీ మ్యాచుల్లో జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒక్కసారి టోర్నీలో అడుగుపెడితే ఆటగాళ్లు దారిలోకి వచ్చేస్తారు’’ అని కోహ్లీ తెలిపాడు. 

మెల్‌బోర్న్‌ వేదికగా దాదాపు లక్ష మంది అభిమానుల మధ్య జరిగే భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌పైనా విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘‘ఇక్కడ ఆట కంటే.. భారీ సంఖ్యలో వచ్చే ఆటగాళ్ల మధ్య ఆడటం నాకిష్టం. అలాంటి అనుభవం ఈడెన్‌ గార్డెన్స్‌లో అనుభవించా. అక్కడ దాదాపు 90వేల మంది క్రికెట్‌ అభిమానుల మధ్య ఆడటం గొప్పగా అనిపించింది. నేను నడిచి వెళ్తుంటే సచిన్‌ తెందూల్కర్, సునిల్ గావస్కర్, కపిల్‌ దేవ్, వసీమ్‌ అక్రమ్, వకార్ యూనిస్‌ వంటి దిగ్గజాలు అభినందించడం మరువలేను. ఇలాంటిదే గత ప్రపంచకప్‌ సందర్భంగా మొహాలీలో చూశా. వరల్డ్‌ కప్‌లు అంటేనే ఒత్తిడెక్కువ. అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. ఇలాంటి క్షణాలు నాకు చాలా ఇష్టం. గేమ్‌ ఆడేది ఇలాంటి ఉద్విగ్నభరిత క్షణాలను అనుభవించేందుకు’’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టీ20 ప్రపంచ కప్‌లో సూపర్‌ -12 పోరు మొదలైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని