WTC Final: ఒకటి కాదు.. 3 మ్యాచులు ఆడించాలి 

అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేయాలంటే ఫైనల్లో ఒకటి కాకుండా మూడు మ్యాచ్‌లు నిర్వహించాలని, అప్పుడు ఎవరు బాగా ఆడితే వారిని విజేతగా గుర్తించాలని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అభిప్రాయపడ్డాడు...

Published : 24 Jun 2021 16:10 IST

ఫైనల్లో మేటి జట్టుగా నిలవాలంటే: విరాట్‌ కోహ్లీ..

సౌథాంప్టన్‌: అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేయాలంటే ఫైనల్లో ఒకటి కాకుండా మూడు మ్యాచ్‌లు నిర్వహించాలని, అప్పుడు ఎవరు బాగా ఆడితే వారిని విజేతగా గుర్తించాలని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూచించాడు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ గతరాత్రి భారత్‌ను ఓడించి తొలి ఛాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒక్క మ్యాచ్‌తో ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేయడం అనే విషయాన్ని తాను అంగీకరించనని చెప్పాడు.

ఒకవేళ ఫైనల్‌ను టెస్టు సిరీస్‌గా నిర్వహిస్తే.. ఇరు జట్ల మధ్యా మూడు మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలని, అక్కడ ఎవరు బాగా ఆడితే వారిని విజేతగా ప్రకటించాలని కోహ్లీ పేర్కొన్నాడు. ఒక మ్యాచ్‌లో ఓడిన జట్టు తర్వాత పుంజుకుంటుందా లేక పూర్తిగా విఫలమవుతుందా అనేది పరీక్షించాలన్నాడు. ఈ విషయంపై దృష్టిసారించాలని, భవిష్యత్‌లో కచ్చితంగా దానికోసం కసరత్తు చేయాలని భారత సారథి అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తే ఇరు జట్ల ఆటగాళ్ల బలాబలాలు తెలుస్తాయని, పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని, ఒకసారి ఆటలో వెనుకబడ్డా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఒక మ్యాచ్‌లో చేసిన తప్పులు మరో మ్యాచ్‌లో సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నాడు.

చివరగా ఈ ఫైనల్లో ఓటమిపై స్పందిస్తూ.. దీని గురించి తాము పెద్దగా బాధపడటం లేదని చెప్పాడు. ఎందుకంటే.. గత మూడు నాలుగేళ్లుగా టీమ్‌ఇండియా ఒక టెస్టు జట్టుగా ఏం సాధించిందనే విషయాలు తాము అర్థం చేసుకున్నామని తెలిపాడు. కేవలం ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనే కాకుండా అంతకుముందు నుంచే బాగా ఆడుతున్నామని గుర్తు చేశాడు. దాంతో గత కొన్నాళ్లుగా తాము సాధిస్తున్న ఫలితాలు, తమ శక్తి సామర్థ్యాలను ఈ ఒక్క ఓటమితో పోల్చి చూడలేమన్నాడు. తాము ఓడినందుకు ఈ మాటలు చెప్పడం లేదని, టెస్టు క్రికెట్‌ మంచి కోసమే అని పేర్కొన్నాడు. ఈ పోటీలు మరింత తీపిగుర్తుగా ఉండాలని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని