
Virat Kohli: మరో వివాదంలో కోహ్లీ.. జాతీయ గీతాలాపన సమయంలో..
ఇంటర్నెట్ డెస్క్: అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గా మారిన విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. దక్షిణాఫ్రికాతో చివరి వన్డేకు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అతడు చూయింగ్ గమ్ నములుతూ కన్పించాడు. దీంతో అతడిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నిన్న మూడో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి జాతీయ గీతాలాపన చేశారు. భారత ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతుండగా కోహ్లీ చూయింగ్ గమ్ నములుతూ గీతాలాపన చేస్తుండటం కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు రికార్డ్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. కోహ్లీ తీరుపై నెట్టింట పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ జాతీయ గీతాన్ని అవమానించారంటూ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు దుయ్యబడుతున్నారు. అంతకుముందు, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ డకౌట్ అవడంతో అతడిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఓటమితో ముగించింది. వన్డేసిరీస్‌లో చివరి మ్యాచ్ కూడా ఓడిన భారత్‌కు 0-3తో వైట్‌వాష్ పరాభవమే మిగిలింది. చివరి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సఫారీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో ఆతిథ్య జట్టు 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ సేన.. ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభించినా.. మిడిలార్డర్ దెబ్బకొట్టింది. కోహ్లీ, ధావన్ అర్ధ శతకాలతో రాణించినా.. దీపక్ చాహర్ అద్భుతంగా పోరాడినా చివరకు ఓటమి తప్పలేదు. దీంతో వన్డే సిరీస్‌ను సఫారీలు క్లీన్ స్వీప్ చేసింది.