Rishabh Pant : పంత్‌.. కాస్త సంయమనంతో ఆడాలి : సునీల్ గావస్కర్‌

టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్ బ్యాటింగ్‌ శైలిపై మాజీ క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. పంత్‌లో గొప్ప టాలెంట్‌ ఉన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో తరచూ విమర్శల...

Published : 02 Feb 2022 15:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్ బ్యాటింగ్‌ శైలిపై మాజీ క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. పంత్‌లో గొప్ప టాలెంట్‌ ఉన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో తరచూ విమర్శల పాలవుతున్నాడని పేర్కొన్నాడు. అతడు కాస్త సంయమనంతో ఆడితే.. భారత జట్టుకు ఎంతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డాడు.

‘రిషభ్‌ పంత్‌ సత్తా ఏంటో మనందరికీ బాగా తెలుసు. రోజు రోజుకి అతడి బ్యాటింగ్‌పై మన అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఓ మ్యాచులో దారుణంగా విఫలమవుతాడు. మరో మ్యాచులో అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరిస్తాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పంత్‌ గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. సిడ్నీ టెస్టులో 96, బ్రిస్బేన్‌ టెస్టులో 89 పరుగులు చేశాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నా ఫర్వాలేదు. కానీ, కాస్త సంయమనంతో వ్యవహరించాలి. తాను ఎదుర్కొన్న మొదటి 10 బంతుల్లో పరుగులేమీ చేయకున్నా వచ్చే నష్టమేం లేదు. తర్వాతి నాలుగు బంతుల్లో 16 పరుగులు రాబట్టగల సత్తా అతడి సొంతం. అందుకే, కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌.. పంత్‌తో మాట్లాడాలి. అతడిలో ఉన్న టాలెంట్‌ గురించి వివరంగా చెప్పాలి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం జట్టు విజయానికి ఎంత కీలకమో వివరించాలి. 300 స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జట్టు పరిస్థితులకు తగ్గట్లుగా రాణిస్తే చాలు. పంత్ కాస్త సంయమనంతో ఆడితే జట్టుకు ఎంతో మేలు చేకూరుతుంది’ అని సునీల్‌ గావస్కర్ పేర్కొన్నాడు.

ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో పంత్‌ షాట్ సెలెక్షన్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. జొహన్నెస్‌ బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో, కేప్‌ టౌన్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచులో పంత్‌ నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌ చేరిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని