Wrestlers: అనురాగ్ ఠాకూర్ మా కాల్స్‌కు బదులివ్వడం లేదు: రెజ్లర్లు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh) లాంటి వాళ్లను శిక్షించేంవరకు తమ పోరాటం ఆగదని రెజర్లు అన్నారు. 

Published : 28 Apr 2023 18:17 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)ను వెంటనే జైల్లో పెట్టాలని రెజ్లర్లు(wrestlers) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయనపై కేసు నమోదు చేస్తామని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో.. రెజ్లర్ల నుంచి ఈ స్పందన వచ్చింది. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసేవరకు తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మన ఫోన్‌ కాల్స్‌కు బదులివ్వడం లేదని చెప్పారు. 

‘మేం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. కానీ మాకు దిల్లీ పోలీసులపై నమ్మకం లేదు. మేం చేస్తోన్న పోరాటం ఎఫ్‌ఐఆర్ కోసం కాదు. బ్రిజ్‌ భూషణ్‌ లాంటి వ్యక్తులను శిక్షించేందుకే మేం పోరాడుతున్నాం. ఆయన్ను అన్ని పదవులను నుంచి తొలగించాలి. అతడిని జైల్లో పెట్టాలి’ అని రెజ్లర్లు వెల్లడించారు. 

‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సుప్రీంకోర్టు నుంచి దిల్లీ పోలీసులకు ఆదేశాలు అందాయి. ఒక ఫెడరేషన్ చీఫ్ ఇలా వేధిస్తే.. ఒక అథ్లెట్ ఎవరికి ఫిర్యాదు చేయగలరు. చీఫ్ కంటే పెద్ద ఎవరుంటారు. ఆయనపై దిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఆయన్ను జైల్లో పెట్టాలి. మరోపక్క కేంద్ర క్రీడా శాఖ మంత్రి  అనురాగ్ ఠాకూర్ మా ఫోన్ కాల్స్‌కు బదులివ్వడం లేదు’ అని బజరంగ్ పూనియా వెల్లడించారు. ‘బ్రిజ్‌ భూషణ్‌ను అన్ని పదవుల నుంచి తొలగించాలని ప్రధాని మోదీని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన దర్యాప్తు ప్రభావితం చేయగలరు’ అని వినేశ్ ఫొగాట్ అన్నారు. 

WFI అధ్యక్షుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా.. ఆయనపై పోలీసులు కేసు నమోదుచేయలేదని పిటిషన్ దారులు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను స్వీకరించిన సుప్రీం.. రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవే అని వ్యాఖ్యానించింది. దీనిపై స్పందన తెలియజేయాలని ఇదివరకే దిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు కొంత ప్రాథమిక దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్లు అంతకు ముందు దిల్లీ పోలీసులు కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఈ రోజు సాయంత్రం లోగా దిల్లీ పోలీసులు కేసు నమోదు చేస్తారని కోర్టుకు తెలియజేశారు.

డబ్ల్యూఎఫ్‌ఐ(WFI) అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తూ గత ఆదివారం నుంచి స్టార్‌ రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మళ్లీ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకునేంత వరకు తాము నిరసన విరమించబోమని కుస్తీయోధులు స్పష్టం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని