WIvsAUS: ఆసీస్‌కు రెండో షాకిచ్చిన వెస్టిండీస్‌

వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాకు వరుసగా రెండో టీ20లోనూ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొందిన కరీబియన్‌ జట్టు తాజాగా జరిగిన రెండో మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో విజయం...

Published : 11 Jul 2021 11:49 IST

సెంట్‌లూసియా: వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాకు వరుసగా రెండో టీ20లోనూ షాకిచ్చింది. తొలి మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలుపొందిన కరీబియన్‌ జట్టు తాజాగా జరిగిన రెండో మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఐదు టీ20ల ఈ సిరీస్‌లో విండీస్‌ ఇంకో మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

గతరాత్రి జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా పేసర్లు ఆదిలో కట్టుదిట్టంగా బంతులేసినా తర్వాత తేలిపోయారు. దాంతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయారు. ఓపెనర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ (9) ఆదిలోనే ఔటైనా మరో ఓపెనర్‌ సిమ్మన్స్‌ (30; 21 బంతుల్లో 1x4, 3x6) ధాటిగా ఆడాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ (13) సైతం నిరాశపరిచాడు. తర్వాత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (61; 36 బంతుల్లో 2x4, 4x6), బ్రావో (47; 34 బంతుల్లో 1x4, 3x6), రసెల్‌ (24; 8 బంతుల్లో 2x4, 2x6) దంచి కొట్టడంతో విండీస్‌ ఆసీస్‌ ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఛేదనలో విండీస్‌ బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా 140 పరుగులకే 19.2 ఓవర్లలో కుప్పకూలింది. హెడన్‌ వాల్ష్‌ 3/29, షెల్డన్‌ కాట్రెల్‌ 2/22 విజృంభించడంతో ఆసీస్‌ ఏ నిమిషంలోనూ లక్ష్యం వైపు పయనిస్తున్నట్లు కనిపించలేదు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మిచెల్‌ మార్ష్‌ (54; 42 బంతుల్లో 5x4, 1x6) ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు. దాంతో ఆస్ట్రేలియా ఆ స్కోరైనా చేయగలిగింది. లేకుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని