WI vs IND: ఏడేళ్ల క్రితం ట్రినిడాడ్‌లో జరిగిందిదే... ఇప్పుడు ఏమవుతుందో?

విండీస్ - భారత్ జట్ల (WI vs IND) మధ్య రెండో టెస్టుకు ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ వేదికగా నిలిచింది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది.

Updated : 20 Jul 2023 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్ - భారత్ (WI vs IND) జట్ల మధ్య రెండో టెస్టుకు ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ సిద్ధమైంది. చివరిసారిగా ఇరు జట్లూ ఈ మైదానంలో 2016 సిరీస్‌ సందర్భంగా తలపడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడే వెస్టిండీస్- భారత్ మ్యాచ్‌ జరగబోతోంది. అయితే, అప్పుడు ఆడిన నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పుడు బరిలోకి దిగనుండటం గమనార్హం. ఇంతకీ వారెవరు? గత మ్యాచుల్లో రాణించిందెవరు? ఆ రికార్డుల సంగతేంటి? ఆ విశేషాలు తెలుసుకుందాం.

భారత్ - విండీస్‌ జట్ల మధ్య ట్రినిడాడ్‌ వేదికపై 13 టెస్టులు జరిగాయి. ఇందులో చెరో మూడు విజయాలు సాధించగా.. మరో ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఏడేళ్ల కిందట ట్రినిడాడ్ మైదానంలో భారత్ - విండీస్‌ మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది. కానీ, అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. అప్పటి జట్టులోని నలుగురు ఆటగాళ్లు ప్రస్తుత పర్యటనలోనూ ఉన్నారు. కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధవుతున్న విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్‌ రోహిత్ శర్మ, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఇప్పుడున్నారు.

జట్టులో మార్పులు సహజం.. సీనియర్ల పాత్ర చాలా కీలకం

వర్షం కారణంగా రద్దైనప్పటికీ 2016 మ్యాచ్‌లో అశ్విన్‌ ఒక వికెట్‌ తీయడం గమనార్హం. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 62/2 ఉన్న సమయంలో వర్షం వచ్చేసింది. ఐదు రోజులూ ఆటకు వీలు కాకపోవడంతో డ్రాగా ముగిసింది. ఈ క్రమంలోనే అశ్విన్ ఐదు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ తొలి టెస్టులోనే 12 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులోనూ మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

సచిన్‌ సెంచరీ.. ద్రవిడ్, లక్ష్మణ్‌ హాఫ్ సెంచరీలు

సచిన్‌, లక్ష్మణ్‌, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్‌తో కూడిన జట్టు గుర్తుండే ఉంటుంది. చివరిసారిగా పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ మైదానంలో భారత్‌ గెలిచిన మ్యాచ్‌లో ఆ టీమే ఆడింది. 2002లో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. సచిన్ (117) సెంచరీతోపాటు లక్ష్మణ్ (69, 74) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు, రాహుల్ ద్రవిడ్ (67), గంగూలీ (74)  అర్ధశతకాలు సాధించారు. బౌలింగ్‌లో ఆశిశ్ నెహ్రా, జవగళ్ శ్రీనాథ్‌ చెరో  మూడు వికెట్లతో చెలరేగిపోయారు. 

సిద్ధూ డబుల్‌ సెంచరీ

సచిన్‌ తెందూల్కర్ నాయకత్వంలోని భారత్ 1997లో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లింది. అనిల్‌ కుంబ్లే ధాటికి (5/104) విండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. అనంతరం నవ్‌జ్యోత్ సిద్ధూ (201) డబుల్‌ సెంచరీ సాధించడంతో 436 పరుగులు చేసింది. ఆంబ్రోస్‌, కోట్నీ వాల్ష్‌, మెర్విన్‌ డిల్లాన్‌, కార్ల్‌ హూపర్ వంటి బౌలర్లను ఎదుర్కొని మరీ ద్విశతకం సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 299/6 స్కోరుతో దీటుగా స్పందించింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇక 1953 నుంచి 1989 మధ్యలో మరో తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎక్కువగా డ్రా కావడం గమనార్హం.

ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్‌, టీమ్‌ కూర్పు, వెస్టిండీస్‌ పరిస్థితిని చూస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం నల్లేరు మీద నడకే అనొచ్చు. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విండీస్‌.. ఈసారి పుంజుకుని పోటీనిస్తుందేమో చూడాలి. తొలి టెస్టులో యశస్వి జైస్వాల్‌ సెంచరీతో స్టార్‌ అయ్యాడు. రెండో టెస్టులో ఆ స్టార్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని