Babar Azam: ‘ఫైనల్‌కు భారత్‌ వస్తే..?’ విలేకరి ప్రశ్నకు బాబర్‌ సమాధానమిదే..!

భారత్‌, పాకిస్థాన్‌ మధ్యే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ జరుగుతుందని భారీగా అంచనాలు వస్తున్న వేళ కెప్టెన్ బాబర్ అజామ్‌ స్పందించాడు. అదే జరిగితే ఆ ఒత్తిడిని ఎదుర్కొని 100శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని బాబర్‌ తెలిపాడు.

Updated : 10 Nov 2022 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంచనాలను తలకిందులు చేస్తూ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది పాకిస్థాన్‌. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్‌ గెలిస్తే.. చిరకాల ప్రత్యర్థుల రసవత్తర టైటిల్‌ మ్యాచ్‌ను చూడొచ్చు. ఒక వేళ భారత్‌ ఫైనల్‌కు వస్తే.. దాయాదుల పోరులో ఆటగాళ్లపై ఒత్తిడి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ విలేకరి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను ప్రశ్నించారు.

‘‘ఫైనల్‌లో మీకు ప్రత్యర్థిగా నిలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువని మీకూ తెలుసు. అలాంటి కీలక మ్యాచ్‌ల్లో సాధారణంగా ఆటగాళ్లు ఒత్తిడిలో ఉంటారు. మరి ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ వ్యూహాలేంటి?’’ అని బాబర్‌ను విలేకరి అడిగారు. దీనికి పాక్‌ కెప్టెన్‌ స్పందిస్తూ.. ‘‘ఫైనల్‌లో మా ప్రత్యర్థి ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. అయితే అది ఎవరైనా సరే.. మేం 100శాతం ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కష్టపడతాం. ఎప్పుడైనా సవాళ్లను ఎదుర్కొనేందుకే ప్రయత్నిస్తాం. ఈ టోర్నమెంట్‌లో ఎన్నో క్లిష్టమైన దశలను దాటి ఫైనల్‌కు చేరుకున్నాం. అలాంటప్పుడు.. ఫైనల్‌లో భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉంది. గత 3-4 మ్యాచ్‌ల్లో మేం అలాంటి ఆటే ఆడాం. టైటిల్‌ పోరులోనూ అదే కొనసాగిస్తామని ఆశిస్తున్నాం’’ అని బదులిచ్చాడు.

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్‌ జట్లే ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచి పొట్టి ప్రపంచకప్‌ టైటిల్‌ను ముద్దాడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని