
Kohli - Bumrah : కోహ్లీ నిర్ణయం వ్యక్తిగతం.. దాన్ని మనం గౌరవించాలి : బుమ్రా
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా టెస్టు క్రికెట్ పగ్గాలు వదిలేస్తూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమని పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. అతడి నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మా గ్యాంగ్ లీడర్‌గా ఎప్పటికీ అతడే కొనసాగుతాడని చెప్పాడు.
‘మేమంతా చాలా క్లోజ్‌గా ఉంటాం. అందుకే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం మాకందరికీ ముందే తెలిసింది. అతడి నిర్ణయాన్ని మేమంతా గౌరవిస్తాం. అది అతడి వ్యక్తిగతం. నాయకుడిగా జట్టు కోసం ఎంతో శ్రమించాడు. అతడి నాయకత్వానికి విలువిస్తాం. అతడి నిర్ణయాన్ని జడ్జ్ చేయడం సరికాదు. అతడి మానసిక స్థితి ఎలా ఉందో, శరీరం ఎలా స్పందిస్తుందో ఎవరికి తెలుసు. కోహ్లీ సారథ్యంలోనే టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాను. బౌలర్‌గా ఎదిగేందుకు అతడు అందించిన సహకారం మరువలేనిది. కెప్టెన్‌గా జట్టులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు. ఫిట్నెస్ సంస్కృతిని పరిచయం చేశాడు. ప్రతి ఒక్క ఆటగాడు ఫిట్‌గా ఉండేందుకు కృషి చేశాడు. కెప్టెన్‌గా అతడిని ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చాం. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తాం’ అని బుమ్రా పేర్కొన్నాడు.
* కెప్టెన్‌గా అవకాశం వస్తే..
‘టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వస్తే.. దానికి మించిన గొప్ప గౌరవం ఏముంటుంది. కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చినా.. రాకపోయినా నా ఆలోచన దృక్పథంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎల్లప్పుడూ జట్టు విజయం కోసం శ్రమిస్తాను. బౌలర్ల ఆలోచనలకు అనుగుణంగా ఫీల్డింగ్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తాను. అదనపు బాధ్యతల గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. వీలైనంత వరకు రాహుల్‌కి సహకారం అందిస్తూ.. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. యువ బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టినప్పుడు.. సీనియర్లను చాలా ప్రశ్నలు అడిగేవాడిని. వారి అనుభవాలు, సూచనలు, సలహాలు నా ఎదుగుదలకు చాలా ఉపయోగపడ్డాయి’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.