Wrestling: రెండో రోజు కుస్తీ యోధుల ఆందోళన.. క్రీడల మంత్రికి బ్రిజ్‌ భూషణ్‌ ఫోన్‌

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అగ్రశ్రేణి రెజ్లెర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది.

Published : 19 Jan 2023 14:46 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)కు వ్యతిరేకంగా దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)‌, బజరంగ్‌ పునియా (Bajrang Punia), సాక్షి మలిక్ (Sakshi Malik)‌, సంగీత ఫొగాట్‌ సహా పలువురు  క్రీడాకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ.. ‘‘ఈ దేశం కోసం మేం పోరాడుతున్నప్పుడు.. మా హక్కుల కోసం పోరాడుతాం’’ అని తెలిపాడు. బ్రిజ్‌ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే వరకు ఈ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశాడు.

మధ్యవర్తిగా బబితా ఫొగాట్‌..

మరోవైపు, మరో రెజ్లర్‌, భాజపా నేత బబితా ఫొగాట్‌ (Babita Phogat) ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి రెజ్లర్లతో మాట్లాడారు. ‘‘అథ్లెట్లకు ప్రభుత్వం మద్దతుగా ఉంది. ఈ సమస్యను ఈ రోజే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని బబిత తెలిపారు. మరోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లకు పలువురు ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు.

బ్రిజ్‌ భూషణ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని, రెజ్లర్లపై అసభ్య పదజాలాన్ని వాడాడని వీరు ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆయన చాలా ఏళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని వినేశ్ ఫొగాట్‌ ఆరోపించింది. లఖ్‌నవూలో జాతీయ శిబిరంలో అనేక మంది కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగిక దోపిడీ చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.  దీంతో ఈ ఆరోపణలు పెను వివాదానికి దారితీశాయి.

కమిటీ యోచనలో కేంద్రం..

బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ స్పందిస్తూ.. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్‌ఐని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో ఇద్దరు మహిళా సభ్యులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

అనురాగ్‌ ఠాకూర్‌కు బ్రిజ్‌ భూషణ్‌ ఫోన్‌

ఇదిలా ఉండగా.. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ నేడు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur)కు ఫోన్‌ చేశారు. రెజ్లర్లు చేస్తోన్న ఆరోపణలపై ఆయన కేంద్రమంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనపై నిన్న స్పందించిన భూషణ్‌.. తనపై ఓ పారిశ్రామికవేత్త కుట్రకు పాల్పడుతున్నట్లు తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు చేస్తే ఉరిశిక్షకు సిద్ధమని చెప్పాడు. 

బ్రిజ్‌ భూషణ్‌ 2011 నుంచి పదవిలో ఉంటున్నారు. 2019 ఫిబ్రవరిలో మూడోసారి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన భాజపా ఎంపీ కూడా.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు