WTC Final: రిజర్వు డే వివరాలు ఇవే..

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆరో రోజుకు చేరుకుంది. వర్షం కారణంగా ఐదు రోజుల్లో పూర్తి ఆట సాధ్యం కాలేదు. ఫలితంగా ముందే ప్రకటించిన రిజర్వు డే వినియోగిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది....

Published : 23 Jun 2021 13:15 IST

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆరో రోజుకు చేరుకుంది. వర్షం కారణంగా ఐదు రోజుల్లో పూర్తి ఆట సాధ్యం కాలేదు. ఫలితంగా ముందే ప్రకటించిన రిజర్వు డే వినియోగిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.

‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో రిజర్వు డేను ఉపయోగిస్తున్నాం. ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌ ఆరంభంలోనే (2018) ఫైనల్‌కు రిజర్వు డే ఉంటుందని ప్రకటించాం. ఈ ఏడాది మే 28న టెస్టు నిబంధనలు తెలియజేసినప్పుడు మరోసారి గుర్తు చేశాం’ అని ఐసీసీ తెలిపింది. ఆరో రోజైన బుధవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకే ఆట మొదలవుతుంది. మొత్తం 98 ఓవర్లు వేస్తారు. రిజర్వు డే ఆఖరి గంట మొదలవుతుందని అంపైర్లు ముందే సంకేతాలు ఇస్తారు.

‘రిజర్వు డే మొత్తం గరిష్ఠ వ్యవధి కనీసం 330 నిమిషాలు ఉంటుంది. లేదా 83 ఓవర్లు వేయాలి. దాంతోపాటు ఆఖరున గంట సమయం ఉంటుంది. సాధారణ విరామాలు కాకుండా ఆట ఆరంభానికి ముందే అంతరాయం ఏర్పడితే అంతమేరకు చివరిలో పొడిగించొచ్చు. అదీ అందుబాటులో ఉన్న సమయం మేరకే’ అని ఐసీసీ తెలిపింది.

రిజర్వు డే టికెట్ల ధరలను తగ్గించి అమ్ముతున్నామని, ఆట సాగని 1, 4 రోజుల్లో టికెట్లు తీసుకున్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఐసీసీ తెలిపింది. ‘రిజర్వు డే నాడు కూడా ఫలితం తేలకుండా మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే.. రెండు జట్లనూ సంయుక్త విజేతగా ప్రకటిస్తామని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని